24 August, 2026 | 1:14 AM

రాష్ట్ర గీతం ‘జయజయహే’కు కీరవాణి స్వరకల్పన

22-05-2024 01:30 AM

జయజయహేకు కీరవాణి స్వరకల్పన

సీఎంను కలిసిన కవి అందెశ్రీ, కీరవాణి

ఇద్దరిని సన్మానించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ను కొంగొత్తగా విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. 90 సెకన్ల నిడివి ఉండే ఈ గీతానికి స్వరకల్పన చేసే బాధ్యతను ఆస్కార్ విజేత, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు  ఎంఎం కీరవాణికి ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే ఆ గేయానికి కీరవాణి కంపోజింగ్ చేశారు. అయితే దానిని కీరవాణి పాడారా? లేక మరో సింగర్ పాడారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చేతులమీదుగా రాష్ట్ర గీతాన్ని విడుదల చేయాలని రేవంత్ సర్కారు భావిస్తోంది.

సీఎంను మంగళవారం ఆయన నివాసంలో గేయ రచయిత అందెశ్రీ, కీరవాణి కలిశారు. ఈ సందర్భంగా గేయం కంపోజింగ్‌పై చర్చించారు. అనంతరం అందెశ్రీ, కీరవాణిని సీఎం సన్మానించారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి ఒక గీతం ఉండాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అందెశ్రీ ఉద్యమ సమయంలో రాసిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గీతంగా చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. అందుకు ఆ గేయంలో కొన్ని మార్పులు చేయాలని అందెశ్రీకి ప్రభుత్వం సూచించింది. దీంతో ఆయన పాటలో స్వల్ప మార్పులు చేశారు. ఆ తర్వాత ఆ పాటను రాష్ట్ర గీతంగా ఎంపిక చేస్తూ.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది.