calender_icon.png 11 July, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీరవాణికి పితృ వియోగం

09-07-2025 12:00:00 AM

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త (92) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన తెలుగు సిని మా రంగంలో రచయితగా, దర్శకుడిగా గుర్తింపు పొందారు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరు సుబ్బారావు. తెలుగు సినిమాల్లో సంస్కృత ఆధారిత పాటలు రాయడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు శివశక్తి దత్త. తన చిన్న వయస్సు నుంచి కళలపై మక్కువ చూపారు.

ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో చదువు మానేసి, ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు. అక్కడ డిప్లొమా పొంది, తిరిగి తమ సొంతూరు కొవ్వూరుకు వచ్చా రు. కమలేశ్ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. సంగీతంపై ఆసక్తితో గిటార్, సితార్, హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు.

సినిమా రంగంపై ఆసక్తితో చెన్నైకి వెళ్లి, అక్కడ స్థిరపడ్డారు. శివశక్తి దత్త.. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి, రచయిత వీ విజయేంద్రప్రసాద్ సోదరుడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సై, ఛత్రపతి, బాహుబలి, ఆర్‌ఆర్ ఆర్ సినిమాలతోపాటు రాజన్న, హనుమాన్ సినిమాలకు కూడా శివశక్తి దత్త పాటలు రాశారు.