27 August, 2026 | 2:12 AM

డిసెంబర్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్

27-08-2026 12:42 AM

తెలంగాణ వేదికగా నిర్వహణ

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో క్రీడాపోటీలు

హర్షం వ్యక్తంచేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా క్రీడాకారులు తమలో దాగిఉన్న క్రీడా ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు జరిగిన 24 ఎడిషన్ల ‘ఖేలో ఇండియా’ పోటీల్లో దేశ నలుమూలల నుంచి 60 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ ఏడాది జరగనున్న 8వ ఎడిషన్ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్(Khelo India Youth Games)’ను తెలంగాణలో నిర్వహించబోతున్నది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వేదికగా ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ ఎడిషన్‌ల మొత్తం 25 క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఆతిథ్య రాష్ట్రమైన తెలంగాణ.. ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించవచ్చు. దీంతోపాటు మరో కొత్త క్రీడను కూడా ఈ ఈవెంట్‌లో ఆడించనున్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 6 వేల మంది క్రీడాకారులు పాల్గొంటారని అంచనా.

ఈ ‘ఖేలో ఇం డియా యూత్ గేమ్స్’ నిర్వహణ కోసం కేంద్రం రూ.22 కోట్లను విడుదల చేసింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను తెలంగాణకు కేటాయించడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి(G. Kishan Reddy) హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రీడాపోటీలను రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఖేలో ఇండియా పథకం అడ్‌హక్ కమిటీ, స్టీరింగ్ కమిటీల సంయుక్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.

స్పోర్ట్స్ బడ్జెట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని పేర్కొన్నారు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. స్పోర్ట్స్ బడ్జెట్ కేటాయింపు లు పెరిగాయని, ఖేలో ఇండియా వంటి పథకాల ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న క్రీడా ప్రతిభకు సరైన ప్రోత్సాహం లభిస్తోందన్నారు.

ఖేలో ఇండియా స్కీమ్‌లో భాగంగా.. తెలంగాణలో కూడా దాదాపు రూ. 30 కోట్లతో క్రీడా సదుపాయాలను కల్పన జరిగిందని, ఇందులో రూ.11.5 కోట్లతో ఉస్మానియా వర్సిటీ క్యాంపస్‌లో సింథటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్ట్, మహిళల కోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలను కల్పించారని, మరో రూ.18.5 కోట్లతో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో క్రీడా సదుపాయాలను కల్పించారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో 33 ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద మరో రూ.8.5 కోట్లను తెలంగాణలో క్రీడాభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు. 

నేడు మోదీతో ఖేల్ కీ బాత్..

ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా ‘ఖేల్ కీ బాత్, పీఎం కే సాథ్’ పేరుతో ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి.. రెండు కాలేజీల చొప్పున 1,500లకు పైగా కాలేజీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.