28-01-2026 12:03:11 AM
మీ అక్రమ దందాలు అందరికీ తెలిసినవే..
కందుకూరి సునీల్ కుటుంబానికి చేసిన న్యాయం ఏంటో చెప్పాలి
అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందలేవు.
బొల్లం మల్లయ్యపై కోదాడ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ల విసుర్లు
కోదాడ, జనవరి 27: మాజీ ఎమ్మెల్యే మల్లయ్య ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలకు ముందు తన హయాంలో జరిగిన స్కాములను మరువద్దని కోదాడ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు తీవ్ర హెచ్చరికలు చేశారు. మంగళవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల, మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ బాబు మాట్లాడారు. మల్లయ్య హయాంలో చేసిన స్కాములు, అక్రమ దందాలు కోదాడ ప్రజలందరికీ తెలుసు.
దొంగే దొంగ అన్నట్లు నేడు నువ్వే నీతులు చెబుతున్నావు అని మండిపడ్డారు.కర్ల రాజేష్ కుటుంబానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు అండగా నిలిచారని, దీనిపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నావని ఆరోపించారు. అబద్ధాల రాజకీయాలు ఆపుకో. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని హెచ్చరించారు. గతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ ఫ్లెక్సీ బిగించే క్రమంలో విద్యుత్ ఘాతంతో మృతి చెందిన కందుకూరి సునీల్ కుటుంబానికి ఏం న్యాయం చేశావని ప్రశ్నించారు.అప్పుడు లేని దళిత ప్రేమ ఇప్పుడు ఎన్నికల వేళ ఎందుకు గుర్తుకొచ్చింది? అని నిలదీశారు.
అదే విధంగా సీఐలు, ఎస్‌ఐలను నీ అక్రమ వ్యాపారాలకు అడ్డు రాకుండా బెదిరించిన చరిత్ర మరిచిపోయావా అని ప్రశ్నించారు.మట్టి, ఇసుక, గంజాయి దందాల్లో ఆరితేరిన నువ్వు నేడు ముసలి కన్నీళ్లు కార్చడం ప్రజలు నమ్మరు అని తీవ్రంగా విమర్శించారు. మాతంగి శైలజ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేవరపల్లి మల్లేశ్వరి నాగిరెడ్డి, గోపిరెడ్డి స్వాతి, గుండు అనురాధ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొల్లా లక్ష్మీ ప్రసన్న కోటిరెడ్డి, తిపిరిశెట్టి సుశీల రాజు, కర్రి శివ సుబ్బారావు, పద్మ నాగిరెడ్డి జయమ్మ, నెమ్మది దేవమని,విజయలక్ష్మిలు పాల్గొన్నారు.