కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు.. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం!
- మా బిడ్డ వ్యాఖ్యలతో మాకు ఏంటి సంబంధం?
- ఆమె మనోభావాలు ఆమెకుంటాయి
- బీఆర్ఎస్ లోంచి కవిత వెళ్లిపోలేదా?
- సుస్మిత వ్యాఖ్యలపై భట్టితో చర్చించలేదు
హైదరాబాద్: ప్రజాభవన్ లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరిగింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కొండా మురళి(Konda Murali ) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చించారు. సమావేశం నుంచి కొండా మురళి అర్ధంతరంగా బయటకు వచ్చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ తాజా పరిణామాల దృష్ట్యా కీలక నేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సమావేశం నుంచి బయటకు వచ్చిన అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ.... తాము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కొండా మురళి స్పష్టం చేశారు. తమ కూతురు సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఆమె మనోభావాలు ఆమెకు ఉంటాయన్న కొండా మురళి ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదని చెప్పారు. కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏమీ మాట్లాడనని కొండా మురళి అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై మాకు విశ్వాసం ఉందని తెలిపారు.
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, బీఆర్ఎస్ పార్టీ లోంచి కవిత వెళ్లిపోలేదా? అని మురళి ప్రశ్నించారు. తన బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందన్నారు. సుస్మిత వ్యాఖ్యలను భట్టి విక్రమార్కతో చర్చించలేదని వెల్లడించారు. తనకు నచ్చిన ట్లుగా సుస్మిత ఉంటుందని స్పష్టం చేశారు. కొండా సురేఖ అందుబాటులో లేదనడం అవాస్తమని పేర్కొన్నారు. సుస్మితకు 38 ఏళ్లు, ఆమెకు 15 ఏళ్ల వరల్డ్ చాంపియన్ కొడుకున్నాడని, సుస్మిత తనకు తగ్గట్టుగా తాను ఉంటుందని కొండా మురళి వెల్లడించారు. ఓ బిల్లుపై చర్చించేందుకు భట్టి విక్రమార్క దగ్గరికి వచ్చినట్లు ఆయన మీడియాతో అన్నారు.






