బీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు

25-04-2024 01:45:50 AM

బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 24 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో ఆయన పర్యటించారు. తాడురులో దగ్దమైన  తాటిచెట్లను పరిశీలించారు. అనంత రం జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కరీంనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ప్రజలకే తెలియదని ఎద్దేవాచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బండి సంజయ్‌ను గెలిపించేం దుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని విమర్శించారు.

కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేసుకున్నామని, వ్యవసాయాన్ని పండుగలా మార్చుకున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, తిరుగుబాటుకు సిద్ధమయ్యారని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ ఉందని, స్వార్థ నాయకులే పార్టీని వీడుతున్నారని, వారి గురించి బాధ లేదని పేర్కొన్నారు. గ్రామీణస్థాయిలో చురుకైన కార్యకర్తలను తయారు చేస్తామన్నారు. కరీంనగర్ ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మోదీ పాలనలో నిత్యవసర ధరలు పెరిగాయని మండిపడ్డారు. సామాన్యుడి జీవితంపై మోయలేని భారం పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయ రహదారుల అభివృద్ధి పేరి ట ఇంధనంపై అదనపు పన్ను వేసి రూ.3 వేల కోట్లు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ మత రాజకీయాలు తప్ప అభివృద్ధి లేదని ఆరోపించారు. వచ్చే నెల 10న కేసీఆర్ సిరిసిల్లకు వస్తున్నారని.. వేలాది మంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.