calender_icon.png 15 December, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదు

15-12-2025 02:05:05 PM

 పల్లె తీర్పు రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనం 

 కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం 

హైదరాబాద్: తెలంగాణ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో(Telangana Gram Panchayat Elections) అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు సత్తాచాటరని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సత్తాచాటిన వారిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు తీర్పుతో మరోసారి రుజువైందన్నారు. 

ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనం అని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలకు తోడు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే, కాంగ్రెస్ కు ఉరితాళ్లుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) తెలిపారు. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని పేర్కొన్నారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకుచిత్రాన్ని ఛిద్రంచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు చెంపపెట్టులాంటివన్నారు. 

కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిన నేపథ్యంలో ఇక సీఎం రేవంత్(CM Revanth Reddy) అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం కాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మోసాలు, అవినీతి కుంభకోణాలపై అనునిత్యం బీఆర్ఎస్ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి కేటీఆర్ పాదాభివందనలు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ కబందహస్తాల నుంచి విడిపించే ఈ పోరాటాన్ని తమ భుజాలపై మోస్తున్న గులాబీ సైనికులను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుందని భరోసా ఇచ్చారు.