calender_icon.png 17 August, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్నా చేస్తే.. ఆడబిడ్డలపై దమనకాండ

10-12-2024 03:21:55 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ప్రకారం ఆశ కార్యకర్తలు వేతనాలు పెంచాలని ధర్నా చేస్తే ఆడబిడ్డలపై ధమనకాండ చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం కోటిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట తమ వేతనాలు రూ.18 వేలకు పెంచాలని ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆశ కార్యకర్తలు రహీంబి, సంతోషాలను మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి  మంగళవారం కేటీఆర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన వారిని పోలీసులు లోనికి అనుమతించారు. తమను అనుమతించడం లేదని ఆశ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదం చేశారు. సీఎం డౌన్ డౌన్ అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చికిత్స పొందుతున్న వారిని  పరామర్శించిన అనంతరం ఓపి బ్లాక్ ఎదుట కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ... ఆశా వర్కర్లపై చేయి వేసిన పోలీసు అధికారులను వెంటనే డిస్మిస్ చేయాలన్నారు. సోమవారం కోటిలో ఆడబిడ్డలపై జరిగిన పోలీసుల దుశ్శాసన పర్వాన్ని దేశం మొత్తం చూసిందన్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణం మండిపడ్డారు. ఆయన దగ్గర హోం శాఖ బాధ్యతలు కూడా ఉన్నాయని విమర్శించారు.

ఈ ఘటనపై మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ లను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆశ కార్యకర్తలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. ప్రభుత్వం ఒత్తిడిపై వారిని త్వరగా డిశ్చార్జ్ చేయొద్దని సూచించారు. ఆశాలు కోరితే తమ పార్టీ నుంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో ఆశాలకు మూడుసార్లు వేతనాలు పెంచి రూ.10 వేలకు తీసుకొచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రభాకర్ వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. మహిళలపై జరిగిన దమనకాండ, వేతనాల పెంపుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.