25 March, 2026 | 2:08 AM

కేయూ క్రాంతి కిరణం

25-03-2026 12:00 AM

ప్రొ.లింగమూర్తి :

కొందరు వ్యక్తులు భౌతికంగా మనకు దూరమైనా వారి సేవలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. అలాంటి మహనీయుల్లో కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.లింగమూర్తి ఒకరు. 1951లో కరీంనగర్ జిల్లా చౌటపల్లి గ్రామంలో జన్మించిన ఆయనది అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం. ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శం.

1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీజీ పూర్తి చేసి వరంగల్ సీకేఎం కళాశాలలో అధ్యాపకుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, విప్లవ కవి వరవరరావుతో ఏర్పడిన పరిచయం ఆయన సామాజిక అభ్యుదయ దృక్పథంపై బలమైన ప్రభావం చూపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 1980లో ఎంఫిల్ పూర్తి చేసిన ఆయన 1981లో కాకతీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.

బోధన, పరిశోధనతో పాటు పరిపాలనలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవంలో ఆర్థిక, సామాజిక అంశాలపై జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అనర్గళమైన ఉపన్యాసాలిచ్చారు. ఆయన పర్యవేక్షణలో 12 మంది పీహెచ్‌డీలు, 20 మంది ఎంఫిల్ పట్టాలు పొందారు. ఆయన ఎనిమిది పుస్తకాలు రచించడమే కాకుండా, 35 పరిశోధన పత్రాలు, నాలుగు రీసెర్చ్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు.

విభాగాధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్, పరీక్షల నియంత్రణా అధికారి, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్, ప్రిన్సిపల్ వంటి ఎన్నో కీలక బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా, తెలంగాణ యూనివర్సిటీ ఇన్ ఛార్జి వీసీగా ఆయన సేవలు అజరామరం. న్యాక్ పీర్ కమిటీ ఛైర్మన్గా కూడా వ్యవహరించిన ఆయన రిటైర్మెంట్ తర్వాత తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

2007 నుంచి 2010 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా ఉన్న కాలంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. కేంద్రం 2009 డిసెంబర్‌లో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన ప్రకటన ఇచ్చిన తర్వాత క్యాంపస్‌లో విద్యార్థులపై పోలీసుల నిర్బంధం పెరిగినప్పుడు ఆయన గట్టిగా నిలబడ్డారు. తన అనుమతి లేకుండా పోలీసులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టరాదని తెగేసి చెప్పారు. అవసరమైతే పదవిని వదులుకోవడానికైనా సిద్ధమని తన స్థ్యుర్యాన్ని చాటిచెప్పారు.

పార్ట్ టైం, కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు పెంచి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. కేయూలో దూరవిద్యా కేంద్రాన్ని బలోపేతం చేసి, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేశారు. పరీక్షల నియంత్రణా అధికారిగా ఉన్న సమయంలో ఫలితాల వెల్లడిలో పారదర్శకతను, వేగాన్ని పెంచేందుకు సాంకేతికతను జోడించారు. ఆయన హయాంలోనే అనేక కొత్త కోర్సులు ప్రారంభమై కేయూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

అందరితో స్నేహభావంతో మెలిగే ఆయన క్యాంపస్ అజాతశత్రువుగా గుర్తింపు పొందారు. ఆయన ఈనెల 14న తుదిశ్వాస విడిచారు. అంతిమయాత్రలో వందలాది మంది శిష్యులు హాజరై నివాళులర్పించడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. మా గురువు భౌతికకాయాన్ని మోసే అవకాశం దక్కడం నేను సమర్పించిన గురుదక్షిణగా భావిస్తున్నాను. 

  - డాక్టర్ తిరుణహరి శేషు,

వ్యాసకర్త సెల్: 9885465877