కథ అడ్డం తిరిగింది!
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు డొల్ల అని ప్రపంచానికి తెలిసిపోయింది. ఇరాన్‌పై ఆయన సాగిస్తున్న దాడులు ముమ్మాటికీ అన్యాయమైన దురాక్రమణ తప్ప మరొకటి కాదు. యుద్ధం ఆరంభంలో ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు ట్రంప్ తలొగ్గారు. అలాగే, ఇరాన్‌లోని చమురు నిక్షేపాలపై తమ ఆధిపత్యం సాధించొచ్చనే దురుద్దేశంతో ఆయన యుద్ధం ప్రారంభించారు.
అన్ని ఎత్తులు, పైఎత్తులు వికటించడంతో తన వైఫల్యాలను ఇప్పుడు ఇతరులపైకి నెట్టేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా టెన్నెసీలో జరిగిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇరాన్‌దీపై దాడి చేయమని తనకు రక్షణశాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ సూచించారని, పీట్ మాట వినే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఒక శక్తిమవంతమైన దేశానికి అధినేతగా ఉండి, యుద్ధం వంటి కీలక నిర్ణయాల విషయంలో పక్కవారిపై నిందలు వేయడం ట్రంప్ దివాళాకోరుతనానికి అద్దం పడుతోంది.
పైగా దేశాపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఈ యుద్ధంపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పడం ద్వారా తన ప్రభుత్వంలోనే ఏకాభిప్రాయం లేదనేది స్పష్టమైంది. ఇరాన్ ప్రతిఘటన గల్ఫ్ దేశాల్లోని చమురు నిక్షేపాలను, శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటుందని తాము ఊహించలేదని ట్రంప్ చెప్పడంతో చూస్తుంటే, ఆయన ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే యుద్ధంలోకి దూకినట్లు స్పష్టమవుతున్నది. రెండు దశాబ్దాల కిందట ఇరాక్ వద్ద భారీ విధ్వంసకర జీవ ఆయుధాలు ఉన్నాయనే సాకుతో ఆ దేశంపై అమెరికాపై దాడి చేసింది.
ఆ దేశాధినేత సద్దాం హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నది. 2006లో సద్దాంను ఉరితీసింది. తర్వాత, ఇరాక్‌లో ఎప్పుడూ ప్రమాదకర ఆయుధాలు లభించలేదు. దీంతో అమెరికా కపటత్వం లోకానికి తెలిసిపోయింది. నాడు అమెరికా ఎంతటి అపప్రధ మూటగట్టుకుందో, నేడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మట్టుపెట్టి అంతకంటే ఘోరమైన అపకీర్తిని అమెరికా పొందింది. ఖమేనీని భౌతికంగా తొలగిస్తే ఇరాన్ చమురు నిక్షేపాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చని, ఆ దేశాన్ని లొంగదీసుకోవచ్చని ట్రంప్ కలలుగన్నారు.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇరాన్ పగ్గాలు చేపట్టిన కొత్త నాయకత్వం మునుపటి కంటే బలంగా, పట్టుదలతో అమెరికాకు ఎదురు నిలుస్తున్నది. ట్రంప్‌ను ముప్పు తిప్పలుపెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్నది. 48 గంటల్లో హోర్ముజ్ జలసంధి తెరవకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించి, తర్వాత కొద్ది గంటల్లోనే ఐదు రోజులపాటు దాడులు నిలిపివేస్తామని ప్రకటించడాన్ని ట్రంప్ గిమ్మిక్కు అని కొట్టిపడేసింది.
అంతర్జాతీయ చమురు మార్కెట్లను ప్రభావితం చేసేందుకు, ప్రపంచ దేశాల కళ్లలో మట్టి కొట్టేందుకు ట్రంప్ ఆడుతున్న ఒక నాటకమని తేల్చిపారేసింది. అమెరికా పీచమణిచే వరకు వెనక్కి తగ్గేది లేదని కుండబద్ధలు కొట్టింది. తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటూ, ప్రపంచ శాంతిని పణంగా పెడుతున్న ట్రంప్ వైఖరి పట్ల అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తి పోస్తున్నది. అధికార దాహం, ఆధిపత్య కాంక్షతో ట్రంప్ సాగిస్తున్న ఈ క్రీడ, పక్కా ఇరాన్ దురాక్రమణేనని అంతర్జాతీయ పౌర హక్కుల ఉద్యమకారులు చెప్తున్నారు.




