ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యం
రూ. 573.28 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి తో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నారాయణపేట జులై 13 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మక్తల్ నియోజకవర్గంలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం కోసం విచ్చేసిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గార్లకు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ తో పాటు ప్రజాప్రతినిధులు కలిసి రూ.237 కోట్లతో నిర్మించనున్న మక్తల్‌నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన చేసి, హ్యామ్ రోడ్ల పైలాన్ను మంత్రి కోమటి రెడ్డి. వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... మక్తల్ నియోజకవర్గంలో రూ.573.28 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేశాం. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి కాక ముందు నుంచే ప్రతి సమావేశంలో మక్తల్‌నారాయణపేట రహదారి గురించి ప్రస్తావిస్తూ, ఈ రోడ్డు నిర్మాణాన్ని మంజూరు చేయాలని నిరంతరం కోరేవారని, ఆ విజ్ఞప్తికి అనుగుణం గానే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు.
ఈ రోజు శంకుస్థాపన చేసిన మక్తల్‌నారాయణపేట రహదారిని 12 నుంచి 16 నెలల్లో పూర్తి చేసి, ప్రజలు కేవలం 20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తామని తెలిపారు. రహదారి విస్తరణకు ప్రజలు సహకరించి అవసరమైన భూమిని ఇవ్వాలని, భూములు ఇచ్చే వారికి ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందిస్తుందనీ, రహదారి నిర్మాణం విషయంలో అవసరమైన పరిపాలన అనుమతులన్నింటినీ తొందరగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ను మంత్రి ఆదేశించారు.
సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఒక్క ప్యాకేజీలో రూ. 547 కోట్లు అందులో 4 లైన్ల రోడ్డు నిర్మాణం అంటే ఆషామాషీ కాదు అని అన్నారు. రోడ్డు వ్యవస్థ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి పట్టుదల, ఏమన్నా చేయాలన్న తపన ఉన్న నాయకుడు అని కొనియాడారు. ఇటీవల రోజు 1000 కోట్లు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ప్రతీ నియోజక వర్గంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మింప చేస్తున్నామని మంత్రి తెలిపారు.
వాకిటి శ్రీహరి నేతృత్వంలో మక్తల్ నియోజక వర్గ రూపురేఖలు మారుతాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభమైన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలనే ప్రాధాన్యంగా తీసుకొని ఈ భారీ రహదారి ప్రాజెక్టులను మంజూరు చేసిందని తెలిపారు.
ప్రజలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. మక్తల్ అభివృద్ధి ప్రయాణానికి ప్రజల ఆశీర్వాదం, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస, మార్కెట్ చైర్మన్ లు రాధా లక్మారెడ్డి, సదా శివా రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, ఆర్ అండ్ బీ సీ . ఈ .వెంకటేశ్వర్ రావు, ఎస్.ఈ రాజేందర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






