04-12-2025 01:13:42 AM
జిల్లా కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్, డిసెంబర్:3గ్రామపంచాయతీ ఎన్నికల మూడవ విడత నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కె.హైమావతి బుధవారం కోహెడ మండలంలోని సముద్రాల, బస్వాపూర్ క్లస్టర్లలో పరిశీలించారు. సముద్రాల క్లస్టర్లో సముద్రాల, చెంచేల్ చెరువుపల్లి, మైసంపల్లి గ్రామాలు, బస్వాపూర్ క్లస్టర్లో బస్వాపూర్, నాగసముద్రాల, పోరెడ్డిపల్లి, బత్తులవానిపల్లి, ఆరెపల్లి గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు.
జిల్లాలో రెండు విడతల నామినేషన్ స్వీకరణ పూర్తి అయినట్లు కలెక్టర్ తెలిపారు. మూడవ విడతలో అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, మద్దూరు, కొమురవెల్లి, చేర్యాల, దూల్మిట్ట, కొండపాక, కుకునూరుపల్లి మండలాల పరిధిలోని 163 గ్రామపంచాయతీలు,1432 వార్డులు, 48 క్లస్టర్లలో డిసెంబర్ 3 నుండి 5 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆర్వోలు, ఏఆర్వోలు ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించాకే రిసీవ్డ్ స్లిప్ ఇవ్వాలని, అభ్యర్థుల తాకిడి ఉంటే రెండు కౌంటర్ల వద్ద నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. క్లస్టర్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో నియంత్రణ, శాంతి భద్రతలు పాటించి అభ్యర్థితో పాటు ఇద్దరినే అనుమతించాలని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.