25 August, 2026 | 3:44 AM

చట్టబద్ధంగా, పారదర్శకంగా ఫిర్యాదుల పరిష్కారం

25-08-2026 01:53 AM

ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలి

మెదక్ జిల్లా ఎస్‌పీ డి.వి. శ్రీనివాస రావు

మెదక్ ప్రతినిధి, (ప్రభంజనం) : ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఒక్కో అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక మోసాలు, వేధింపులు తదితర అంశాలపై ఫిర్యాదులను సమర్పించారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయరాదని ఎస్పీ స్పష్టం చేశారు.

ప్రతి వినతిదారుడి సమస్యను బాధ్యతగా పరిగణించి, ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడం, ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి భయం, సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని, ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.