25 August, 2026 | 3:11 AM

ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం!

25-08-2026 01:54 AM
  1. డబ్బు సంపాదనే లక్ష్యంగా కార్పొ‘రేట్‘ వైద్యం
  2. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రోగుల మళ్లింపు
  3. రాజకీయ అండదండలతో అధికారులను సైతం బెదిరిస్తున్న వైనం  

నాగర్ కర్నూల్ ఆగస్టు 24 (విజయక్రాంతి) : నాగర్ కర్నూల్ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యం పేరుతో కమర్షియల్ దందా చేస్తూ పేద రోగుల నుండి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని సామాన్య రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా  క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ, ఐసీయూ యూనిట్ పేరుతో కింది స్థాయి సిబ్బంది చేత ఆన్లైన్ వీడియో కాల్ ఆధారంగా స్థాయికి మించిన వైద్యం చేస్తూ అడ్డగోలుగా దండుకుంటున్నారని వాపోతున్నారు.

ఇదేంటని అడిగే నాధుడు లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను సైతం తమ ఆసుపత్రులకు మళ్లించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని తమ ఇష్టా రీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులే తమ ఆసుపత్రులకు రోగులను రెఫర్ చేసి వారి జేబులకు చిల్లులు పెడుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట పట్టణ కేంద్రాలతో పాటు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలిశాయి.

స్పెషల్ కేర్, స్పెషల్ డిగ్రీల పేరుతో అనుక్షణం  అందుబాటులో ఉంటున్నట్లు బోర్డులు ఏర్పాటు చేసుకొని తమ కిందిస్తాయి సిబ్బంది చేతే వైద్యం చేస్తున్నారని ప్రచారంలో ఉంది. దాంతోపాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ, జీర్ణక్రియ, డెంటల్, ఎముకలు,  చెవి ముక్కు వంటి వాటితో పాటు చిన్నపిల్లలు, ప్రసూతి స్పెషలిస్టుల పేరుతోnoo దోపిడీకి పాల్పడుతున్నారని రోగులు మండిపడుతున్నారు.

మహిళల కొరకు ప్రత్యేకించి గర్భం దాల్చిన నుండి ప్రసవం వరకు వైద్యం పేరుతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేకపోయినా టెస్టులు నిర్వహిస్తూ ప్రతినిత్యం లక్షల్లో దోచుకుంటున్నారని ఆయన పట్టించుకునే నాధుడే లేడని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీలు చేస్తూనే ప్రైవేటు ఆసుపత్రిలో నెలకొల్పి ఎక్కువ సమయం ప్రైవేట్ తమ సొంత ఆస్పత్రులకే సమయం కేటాయిస్తున్నారని రోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

వారిపై చర్యలకు ప్రయత్నించిన అధికారులపై బెదిరింపులకు కూడా దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ముఖ్య నేతలు సైతం ప్రైవేటు ఆసుపత్రి వైద్య యాజమాన్యానికే మద్దతు తెలుపుతున్నారని ఫలితంగా ప్రభుత్వ వైద్యం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి కొంతమంది రోగులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయా ఆస్పత్రుల్లో సెటిల్మెంట్ చేసుకోవాలని సలహాలు ఇస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.

జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రి తమ ఇష్టా రీతిగా రోగుల నుండి ముక్కు పిండివసూళ్లకు పాల్పడుతున్నారని సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రజావాణిలో పెద్దముద్దునూర్ గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదులు కూడా చేశారు.