05-08-2025 01:21:22 AM
-15 ఏళ్లుగా మరమ్మతులు కరువు
-గుంతల మయంగా మారిన రోడ్డుతో ఇబ్బంది పడుతున్న స్థానికులు
శామీర్ పేట్, ఆగస్టు 4: మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీలోని లక్ష్మాపూర్ తండా నుండి మూడు చింతలపల్లి వరకు ఉన్న లింక్ రోడ్డు అద్వాన్నంగా తయారయింది. దాదాపు 16 సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి దాదాపు కోటి 50 లక్షలు మంజూరు చేయించారు. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్ళీ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఆ రోడ్డు గురించి పట్టించుకునే వారే కరువయ్యారు ఈ రోడ్డు కొత్తగా ఏర్పడ్డ మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
సుమారు చుట్టుప్రక్కల 3 - 4 గ్రామాల ప్రజలు మండలానికి నిత్యం ఈ రోడ్డు మీదుగానే ప్రయాణం సాగిస్తుంటారు. రోడ్డు ఎంత గుంతల మయం అయినా పట్టించుకునే వారే కరువయ్యారు .పేరుకు మాత్రం మున్సిపాలిటీ సమీపంలో ఉన్న రోడ్డు మరమ్మత్తులు మాత్రం శూన్యం. రోడ్డు మొత్తం అడుగడుగునా గుంతలు పడడంతో ఈ మార్గం వెంట వెళ్లాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తెలియని పరిస్థితి నెలకొంది. దీనితోపాటు ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే గుంతలు పడి ప్రయాణికులకు నరక ప్రయాణంగా మారిపోయింది. ఇంకా ముందు రాబోయే వర్షాలకు రోడ్డు ఎలా ఉంటుందోనని తండావాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
విన్నవించినా పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
ఈ రోడ్డును మరమ్మతు చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని స్థానికులు తెలిపారు. రాత్రి వేళలో ఈ రోడ్డుపై ప్రయాణించాలి అంటే చాలా భయంగా ఉందని చిన్న వర్షం పడిన గుంతలలో నీరు నిలిచి అక్కడ గుంత ఉందా రోడ్డు ఉందా తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంతలమైన రోడ్డుకు మరమ్మతు చేపట్టాలి
గుంతల మయమైన రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలి. రాత్రి వేళలో ఈ రోడ్డుపై ప్రయాణించే రైతులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు వేసి 15 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు దీనిని పట్టించుకునే వారే లేరు. ఇప్పుడైనా ఉన్నత అధికారులు స్పందించి రోడ్డుకు వరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము..
వెంకటేష్ నాయక్