27-07-2025 01:10:33 AM
ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. జనం కోరుకుంటుంటున్నట్టుగానే మేకర్స్ కూడా తమ సినిమాలకు కమర్షియల్ హంగులు అద్దుతున్నారు. కమర్షియల్ చిత్రం అనగానే గ్లామర్‌దే తొలి ప్రాధాన్యం. ఈ కమర్షియల్ లెక్కలపై హీరోయిన్లకూ అవగాహన అవసరమేగా?! అందుకే ఇప్పుడు ముద్దుగుమ్మలు సైతం ‘కమర్షియల్’గానే ఆలోచిస్తున్నారు! ఇందుకు తామూ అతీతం కాదంటూ పోటీకొస్తున్నారు సీనియర్ హీరోయిన్లు, స్టార్ బ్యూటీలు. తమ స్టార్‌డమ్‌ను సైతం పక్కన పెట్టేసి, యంగ్ హీరోలకు సైతం ఛాన్స్ ఇచ్చేస్తూ ఈతరం ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు.
వెండితెరపై ప్రస్తుతం సరికొత్త కమర్షియల్ కాంబినేషన్లు ఈతరం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కిస్సులకైనా, హగ్గులకైనా ఆ పైన యంగ్ హీరోలతో రొమాన్స్ చేసేందుకైనా, ఇంటిమేట్ సీన్లలో నటించేందుకైనా సై అంటున్నారు. హీరో ఇమేజ్‌తో పని లేకుండా కంటెంట్‌కే ప్రాధాన్యమిస్తున్నారు.
ఎవరు.. ఎవరితో..?
సీనియర్ నాయిక.. జూనియర్ నాయక కలయిక చిత్రాలు ముఖ్యంగా కొవిడ్ తర్వాత విరివిగా తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎంతో పేరున్న దీపికా పడుకొణె ‘గెహ్రైయాన్’ సినిమాలో సిద్ధార్థ్ చతుర్వేదితో కలిసి నటించింది. శకున్ బత్రా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో అద్భుతమైన స్టార్‌డమ్ ఉన్న విజయ్ సేతుపతి బాలీవుడ్‌లో ఫేమస్ కాస్త తక్కువే అని చెప్పొచ్చు. ఆయనతో ‘మెర్రీ క్రిస్మస్’ (2024)లో సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో కలిసి నటించింది. ప్రతీక్ గాంధీ కలిసి నటించిన చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’. సీనియర్ హీరోయిన్‌గా పేరున్న విద్యాబాలన్ ఇందులో ప్రతీక్‌తో రొమాన్స్ చేసింది.
తెలుగులో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న టబు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంట్రీలోనూ తన జోరు సాగిస్తోంది. ఆమధ్య అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్‌సిరీస్ ‘ఏ సూటబుల్ బాయ్’ ద్వారా డిజిటల్ మీడియాలోకి ప్రవేశించింది. ఇందులో ఆమె నడి వయస్కురాలైన మహిళగా కనిపించగా, ఆమెతో ప్రేమలో పడే కుర్రవాడిగా ఇషాన్ ఖట్టర్ నటించాడు. సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టికి తెలుగు చిత్రపరిశ్రమలో ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో తెలిసిందే. అయినా యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’లో నటించింది. ఇక సమంత కూడా స్టార్‌డమ్‌తో పనిలేకుండా స్క్రిప్టుకు విలువనిస్తూ చిన్న హీరోలతో చేసేందుకు ఓకే అనేసిందీ ముద్దుగుమ్మ. ‘శాకుంతలం’లో సమంత మోహన్ జోడీ మెప్పించింది. ‘యశోద’ చిత్రంలో ఉన్ని ముకుందన్‌తోనూ కలిసి నటించింది. ఇంకా అనుష్క , తమన్నా వంటి సీనియర్ భామలు ఎందరో ఈ జాబితాలో ఉన్నారు.
టాలీవుడ్‌లో..
సీనియర్ హీరోయిన్లు, యువ హీరోలు అనే తేడా ఉండటంలేదు. ఈ కోవలో వచ్చిన ఇటీవలి చిత్రాలంటే.. కీర్తి సురేశ్ ‘ఉప్పు కప్పురంబు’ గురించి చెప్పుకోవాలి. స్టార్‌డమ్ మెయింటేన్ చేస్తున్న ఈ యువ ‘మహానటి’ ఈ సినిమాలో సుహాస్‌తో కలిసి నటించింది. ఇక శ్రీలీల మరో అడుగు ముందుకేసి ఏకంగా డెబ్యూ హీరో అయిన కిరీటితో ‘జూనియర్’ అనే చిత్రంలో ఆడిపాడింది. బాలకృష్ణ, మహేశ్‌బాబు వంటి స్టార్స్‌తో నటించిన ఈ డ్యాన్సింగ్ గాళ్ చేతిలో పవన్‌కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో, రవితేజతో ‘మాస్ జాతర’లోనూ కనిపించనుంది. ఇలా ఓ వైపు స్టార్స్ సరసన అవకాశాలు పొందుతూనే, మరోవైపు కొత్త కుర్రాడితో జత కట్టి ఆశ్చర్యపరిచింది.
జాబితాలోకి కరీనా కపూర్!
తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా ఓ యంగ్ హీరోకు ఓకే చెప్పింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ చిత్రాలకు పనిచేసిన హుస్సేన్ దలాల్ ఓ స్టోరీ సిద్ధం చేశాడు. ఇందులో ఓ యువ హీరోను కథానాయకుడిగా తీసుకున్నాడు. అతడి పేరు ఇంకా రివీల్ చేయలేదు. హీరోయిన్‌గా కరీనా కపూర్ అయితే బాగుంటుందని మేకర్స్ అమెను సంప్రదించారు. తొలుత ఆమె అంగీకరిస్తుందా.. లేదా? అన్న సందేహంతోనే వెళ్లారు. కానీ, కథ విన్న కరీనా నో చెప్పలేకపోయిందట. హీరోగా ఎవరు నటిస్తున్నారు? అన్నది కూడా అడగకుండా తాను చేస్తానని కమిట్ అయిందట. ఇందులో కరీనాది ఆ యువ హీరోతో ప్రేమలో పడే పాత్ర అని అంటున్నారు. ఆ పాత్రల మధ్య ఘాటైన రొమాన్స్ కూడా ఉంటుందని సమాచారం. హీరో గురించి మేకర్స్ కరీనాకు ఫోన్ చేసి చెప్పగా అదేం పెద్ద విషయం కాదని భరోసా ఇచ్చిందట. కథ, పాత్ర నచ్చడంతోనే అంగీకరించినట్టు తెలిపింది.