27-07-2025 03:13:08 PM
హైదరాబాద్: గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పరకాలలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలకు కేసీఆర్ కిట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ... నిన్నైనా, రేపైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా బహుజనులకు వారి న్యాయమైన వాటాను ఇస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్(Gift A Smile) కార్యక్రమంలో భాగంగా పరకాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లు పంపిణీ చేసిన కేటీఆర్, స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీలతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సెట్ అవుతారని చెప్పారు. పరకాల నియోజకవర్గంలో ఉన్న 55 ఎంపీటీసీల్లో 58 శాతం టికెట్లను అంటే 32 ఎంపీటీసీ స్థానాలను రేవంత్ రెడ్డి గాడ నిద్రలో ఉన్నప్పుడే బీసీ సోదరులకు ఇచ్చామన్నారు. ఇంతేకాదు 109 సర్పంచులలో 49 శాతం అంటే సుమారు 49 స్థానాలను బీసీలకు ఇవ్వడంతో పాటు ఆరు జడ్పిటిసిల్లో 3 స్థానాలు, ఆరు ఎంపీపీలో 3 స్థానాలను బహుజనులకే కేటాయించినట్లు కేటీఆర్ వెల్లడించారు.
దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కీటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాము చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలన్న కాంగ్రెస్ గుండాయిజంతో పరిశ్రమలు పారిపోయే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. కాకతీయ టెక్స్ టైల్ పార్కులో కాలువ నిర్మాణానికి జనవరిలో రూపొందించిన రూ.137 కోట్ల అంచనాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో రూ.297 కోట్లకు పెరిగాయన్నారు. కాలువ నిర్మాణం పేరుతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు రూ.167 కోట్లు దోచుకోవాలనుకున్నారని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు కు పరిశ్రమలను తెప్పించి తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అనుకుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని నిలువు దోపిడి చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించకపోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదన్న కేటీఆర్, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై నిలదీస్తామన్నారు.