27-07-2025 02:58:44 PM
చెత్తాచెదారంతో మూసుకుపోయిన నాళాలు... వర్షంతో తీవ్ర ఇబ్బందులు...
రాత్రి వెళలో వెలగని వీధి దీపాలు... పట్టించుకోని పంచాయతీ అధికారులు...
కలెక్టర్ గారు ఇక మీరే సీతంపేట సమస్యలు తీర్చండి... వేడుకుంటున్న గ్రామస్తులు
ముత్తారం,(విజయక్రాంతి): ఆ గ్రామంలో చెత్తాచెదారంతో పాటు మూసుకుపోయిన నాళాలతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో ముత్తారం మండలంలోని సీతంపేట గ్రామం కంపు కొడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం గ్రామంలో గత 18 నెలల నుండి గ్రామ సమస్యలు ఎక్కడికి అక్కడ కుంటుపడ్డాయని, వీధి దీపాలు రాత్రి వెలుగతలేవని, గ్రామంలో నాళాలు నీటితో నిండగా, దోమలు తయారై ప్రజలు విష జ్వరం బారిన పడుతున్నారని, గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు నడి ఊరిలో నుండి వెళ్లిన కెనాల్ లోని మట్టి పూడిక తీయకపోవడం వలన చెత్త చెదారం నిండుకపోయి మురికి నీరు నిల్వ ఉన్నదని,
దీంతో విపరీతమైన దుర్వాసన తో పాటు దోమలు కుట్టి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటి వరకు బ్లీచింగ్ పౌడర్ గాని దోమల మందు పిచికారి చేయడం లేదని గ్రామానికి చెందిన ఇండ్ల సది తెలిపారు. తాను వారం క్రితం ఎంపీడీవో కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు స్పందన లేదన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులను సీతంపేట గ్రామానికి పంపించి గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని మాజీ సర్పంచ్ పులిపాక నాగేష్ వేడుకుంటున్నారు.