calender_icon.png 27 July, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు ముఖ్యం

27-07-2025 12:31:03 PM

రైతులు సకాలంలో స్పందించాలి 

వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్

భీమారం,(విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పంటలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మేలని మండల వ్యవసాయ శాఖ అధికారి అత్తే సుధాకర్ రైతులకు సూచించారు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు పాటించడం మేలన్నారు. రానున్న రెండు రోజులలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో పురుగు, కలుపు మందుల పిచికారీ, పై పాటు ఎరువులను అంధించటం, నాటు వేయడం తాత్కాలికంగా  వాయిదా వేసుకోవాలన్నారు. భారీ వర్షాల సూచన ఉన్నందున మురుగు నీటినీ కాలువలను ఏర్పాటు చేసి బయటకు పంపాలని, ఉరుములు, మెరుపులతో కూడిన అధిక వర్ష సూచనలు ఉన్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలన్నారు. రైతుల చెట్ల కింద నిలబడరాదనీ, మూగజీవాలను సైతం చెట్ల కింద ఉంచరాదని సూచించారు.

వరి సాగు చేస్తున్న రైతులు..

భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుంచి మురుగు నీటిని వీలైనంత వరకూ త్వరగా తీయాలని ఏవో సుధాకర్ సూచించారు. నీటి ముంపునకు గురయిన నారు మడులు, వరి పొలాల నుంచి మురుగు నీటిని వెంటనే తీసివేయాలన్నారు. వర్షాలు తగ్గిన తరువాత, ఇప్పటివరకు నారు వేసుకోని రైతాంగం ఇప్పుడు కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకొని పొలాలను దమ్ము చేసి నేరుగా వరి వెదజల్లే పద్ధతిలో గాని లేదా డ్రం సీడర్ ద్వారా లేదా నేరుగా విత్తే పద్ధతిలో వరిని వేయవలెనన్నారు. దీని ద్వారా 10 నుంచి 15 రోజుల ముందుగానే పంట కోతకు వస్తుందనీ, అంతే కాకుండా 12 కిలో విత్తనం ఎకరానికి సరిపోతుందన్నారు. నేరుగా విత్తె పద్ధతిలో స్వల్ప కాలిక సన్నగింజ రకాలను (120-125 రోజులు) ఎంచుకోవాలన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకున్న రైతులు పచ్చి రొట్టు పంటలను భూమిలో కలియదున్ని దమ్ము చేసుకోవడం ప్రారంభించుకోవాలనీ, దమ్ము చేసుకున్న సమయంలో 50 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ వేసినట్లయితే అది తొందరగా కుల్లడానికి అవకాశం ఉంటుందన్నారు.

పత్తి సాగు చేసిన రైతులు..

ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన పత్తిలో వడ తెగులు తేలికగా ఆశించవచ్చు. వర్షాలు తగ్గిన తరువాత వడ తెగులు సోకిన మొక్కల మొదల్ల దగ్గర 3 గ్రాముల కాపర్-ఆక్సీ-క్లోరైడ్ ను లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి. అలాగే పంట త్వరగా కోలుకోవడానికి ఎకరానికి నీటిలో కరిగే ఎరువులైన కిలో మల్టీ - కె ను లేదా 500 ఎంఎల్ నానో యూరియాను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు.