27-07-2025 01:06:02 PM
వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో గ్రామ పాలనాధికారి, లైసెన్సుడు సర్వేయర్ల ఎంపిక కోసం రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో మొదలైనట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష కోసం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి, హాజరు వివరాలు తెలుసుకున్నారు. పరీక్ష ఉదయం 10.00 గంటలకు ప్రారంభం కాగా 1.00 గంటల వరకు కొనసాగింది. గంట ముందు నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు. అలాగే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా పకడ్బందీగా తనిఖీ చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామ పాలనాధికారి, లైసెన్సుడు సర్వేయర్ల పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిపిఓ పరీక్ష కోసం మొత్తం 62 మంది అభ్యర్థులకు గానూ, 55 మంది హాజరయ్యారని, ఏడు మంది గైర్హాజరయ్యారని చెప్పారు. అదేవిధంగా లైసెన్స్ సర్వేయర్ పరీక్ష కోసం 112 మంది అభ్యర్థులకు గానూ 100 మంది హాజరయ్యారని, 12 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. అయితే లైసెన్సుడు సర్వేయర్ల కోసం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మరో పరీక్ష జరగనుంది. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఏడి సర్వే బాలకృష్ణ, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.