మరో ఇద్దరు నిందితుల అరెస్ట్
- కరీంనగర్ ‘పీఎంజే’ దోపిడీ కేసు
- మొత్తం ఎనిమిదికి చేరిన నిందితు సంఖ్య
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న జరిగిన దోపిడీ కేసులో పోలీసులు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
ఈ నెల 17వ తేదీన కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు ముఖ్య నిందితుల కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా నింది తుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
షోరూంలో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో తాజాగా మూడో వ్యక్తి అయిన సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా రామడుగు మండల శివారులోని ఎస్‌ఆర్‌ఎస్పి కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో కీలక ఆధారాలు సేకరించారు.
నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన ఐదు జతల దుస్తులు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్సి కార్డులు, ఒక రెడ్ మి మొబైల్ ఫోన్తో పాటు అక్కడ దాచి ఉంచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో కీలక నిందితుడు ఎం.డి. ఆదిల్ ఖాన్ను బీహార్ రాష్ట్రం పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటా కార్ డ్రైవర్ జైనులబ్దీన్కు నేరానికి సహకరించేందుకు ఈ ఆదిల్ ఖానే క్రెటా కారును, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది.






