వరకట్నంపై కఠిన హెచ్చరికలు…
మహిళల రక్షణపై చట్ట అవగాహన కార్యక్రమం
చివ్వెంల,(విజయక్రాంతి): గౌరవనీయ భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రామ ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించేందుకు సూర్యాపేట జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ ఆధ్వర్యంలో చివ్వెంల గ్రామంలో చట్ట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు ముఖ్య అతిథిగా హాజరై గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లో ఎక్కువగా జరుగుతున్న వరకట్న వేధింపులు, వరకట్న మరణాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
మహిళలపై క్రూరత్వం (సెక్షన్ 498-ఎ ఐపీసీ), వరకట్న మరణం (సెక్షన్ 304-బి ఐపీసీ) వంటి నేరాలపై కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయని ఆమె తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, పిల్లలను ప్రేమతో, బాధ్యతతో పెంచాలని సూచిస్తూ, బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు పూర్తికాకముందు వివాహం జరిపితే అది చట్టవిరుద్ధమని, అలాంటి సందర్భాల్లో శిక్షలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ఆడ, మగ అనే తేడా లేకుండా సమానత్వ భావన పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.




