calender_icon.png 1 July, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమలను తరిమేద్దాం!

29-06-2025 12:00:00 AM

వానకాలంలో దోమల బెడద సహజంగా పెరుగుతుంది. వాటితో వ్యాధుల ముప్పు కూడా వస్తుంది. ఈ క్రమంలో బాల్కనీ, టెర్రస్‌పై కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటే.. దోమలతో ఇబ్బంది తప్పుతుంది. 

ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వేప.. సహజసిద్ధమైన పురుగుమందుగా పనిచేస్తుంది. ఇప్పటికీ ఊళ్లలో దోమలు, క్రిమికీటకాలను తరిమేసేందుకు వేపాకులను కాల్చి.. పొగ పెడుతుంటారు. వేపనూనెతోనూ దోమలను తరిమికొట్టొచ్చు. కాబట్టి మీ పెరటి తోటలో ఓ వేప మొక్కను నాటండి. ఇప్పుడు బోన్సాయ్ రూపంలోనూ వేప చెట్లు పెరుగుతున్నాయి. వాటిని బాల్కనీలో పెంచుకోండి. 

లావెండర్.. ఈ మొక్కల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. దోమలను తరిమేస్తుంది. ఇంటి గుమ్మం, కిటికీల దగ్గర లావెండర్ మొక్కలను పెంచితే.. ఇంటికి కొత్త అందం రావడంతో పాటు దోమల బాధ కూడా తప్పుతుంది. 

తులసి ఆకుల నుంచి సుగంధమైన, ఘాటు వాసనలు వస్తాయి. ఇవి మనిషికి ఆరోగ్యాన్ని అందిస్తే.. దోమలకు అసహ్యంగా ఉంటాయి. అందుకే.. తులసి మొక్క ఉన్నచోట దోమలు వృద్ధి చెందవు. ఓ తులసి మొక్క పెంచడం వల్ల.. ఇల్లు మొత్తం ఔషధ గుణాలతో కూడిన గాలి వ్యాపిస్తుంది. ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. 

బంతి.. ఈ మొక్క నుంచి వచ్చే ఘాటు వాసనలు కూడా.. దోమల నిరోధకంగా పనిచేస్తాయి. దోమల మందుల్లోనూ బంతిపూల తైలాలను వాడతారు. అందుకే ఇంట్లో బంతి మొక్క పెంచడం చాలా ఉపయోగకరం. 

నిమ్మగడ్డి దోమలను తరిమికొట్టడంలో నిమ్మగడ్డి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సిట్రోనెల్ల ఆయిల్ దోమల నివారణలో ముందుంటుంది. అందుకే దోమల మందుల్లోనూ ఈ నూనెను వాడుతారు. ఈ మొక్క ఆకులను కొద్దిగా నూరి.. ఇంట్లో నీటిలో కలిపి పెడితే.. దోమలు పారిపోతాయి.