01-07-2025 02:29:25 AM
సంగారెడ్డి, జూన్ 30 (విజయక్రాంతి)/పటాన్‌చెరు: సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పేలుడు విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించా రు. పటాన్‌చెరు, చందానగర్, మదీనగూడ దవాఖానల్లో చికిత్స పొందుతున్న కార్మికులను వారు పరిశీలించి వారి కుటుంబీకుల తో మాట్లాడి ధైర్యం చెప్పారు.
అనంతరం మంత్రి దామోదర మాట్లాడారు. ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం బాధాకరం అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. గాయపడిన కార్మికులకు కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని, వారిని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పా రు.
కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిశ్రమ వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్ద ని, ఇది తగిన సమయం కాదని సూచించారు.
అధికారుల ద్వారా విచారణ: మంత్రి వివేక్
రియాక్టర్ పేలుడు వల్ల కాదు, ఎయిర్ ఫైర్ సిస్టమ్‌లో ప్రెషర్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని కార్మిక శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారుల ద్వారా విచారణ ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తరఫున మెరుగైన ఎక్స్‌గ్రేషియా (సహాయ నిధి) అందించడంతో పాటు క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా పరిశ్రమల్లో అవసరమైన భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలుచేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రమాద స్థలంలో మంత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
యాజమాన్య నిర్లక్ష్యమే కారణం: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆరోపించారు. గత 30 సంవత్సరాలుగా పరిశ్రమ యాజమాన్యం కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
గతంలో కూడా ఇదే పరిశ్రమంలో భారీ ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.కోటి, గాయపడిన కార్మికులకు రూ.50 లక్షల నష్టపరిహారం పరిశ్రమ చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చారు.