29-06-2025 12:00:00 AM
ఆస్టియోపోరోసిస్.. చాపకింద నీరులా ఆరోగ్యాన్ని
గుల్లచేస్తున్నది. మనదేశంలో ఆస్టియో పోరోసిస్ కేసులు అధికం. ఇక మహిళల్లో ఈ రుగ్మత ముప్పు మరింత ఎక్కువ. యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఆస్టియోపోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో మూడింట ఒక వంతు మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ కేసులు తప్పక కనిపిస్తాయి.
ఆస్టియోపోరోసిస్ అనేది సైలెంట్ కిల్లర్. ఇది ఎముకలను నెమ్మదిగా బలహీనపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లు పైబడిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఈ వ్యాధి బారినపడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, హార్ట్ ఎటాక్, స్ట్రోక్‌ల కంటే ఎక్కువగా వేధిస్తున్నా సమస్య ఆస్టియోపోరోసిస్. అవగాహన లోపంతో ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళలే అధికం. ఈ నేపథ్యంలో ఎముక ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వ్యాధిని ఎలా గుర్తించాలి? వంటి అంశాలను తెలుసుకుందాం. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముక సాంద్రత తగ్గి, క్రమంగా ఎముక క్షీణించడం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక వ్యాధి. ఫలితంగా ఎముకలు బోలుబోలుగా, బలహీనంగా అవుతాయి. పెళుసు బారతాయి. ఫలితంగా విరిగే ముప్పు పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం బీఎమ్‌డి 2.5 ఎస్‌డిలు తక్కువగా ఉన్నవారికి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువని తేల్చింది.
మహిళల్లో అధికం
ఆస్టియోపోరోసిస్ ఉందని తెలుసుకున్న 50 శాతం మందిలో.. మెనోపాజే అం దుకు ప్రధాన కారణమని తేలింది. రుతుక్రమం ఆగిపోయే దశ మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతున్నాయడానికి ఇదో సూచన. అండాశయాలు అనేవి రుతుక్రమాన్ని ప్రేరేపించే ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎముకలు దృఢంగా ఉండటానికి సహకరిస్తుంది. ఎముకలు క్షయమయ్యే క్రమాన్ని నెమ్మదింపజేస్తుంది. ఇక ఈస్ట్రోజెన్ స్థాయులు దీర్ఘకాలంపాటు తక్కువగా ఉంటే.. ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతున్నట్టు భావించాలి.
మనదేశంలో మహిళలు పాలు, విటమిన్ డి ఉన్న పదార్థాలు తీసుకోవడం చాలా తక్కువ. అన్ని పోషకాలూ ఉన్న ఆహారాలు తీసుకోవడమూ వాళ్లలో తక్కువే. కాబట్టి మహిళల్లో ఈ రిస్క్ మరింత ఎక్కువ రుతుక్రమం ఆగిన మహిళల్లోనూ, గర్భసంచితో పాటు ఒకటి లేదా రెండు ఓవరీస్ తీయించుకున్న వాళ్లల్లో.. చాలాకాలం పాటు స్టెరాయిడ్స్ వాడేవారిలో వ్యాయామం చేయని వారిలో ఈ వ్యాధి త్వరగా సోకుతుంది.
లక్షణాలు..
ఎముకలు దేహం లోపల ఉంటాయి కాబట్టి ఆస్టియోపోరోసిస్ వచ్చే సూచనలు ముందే కనిపించేందుకు అ వకాశం లేదు. ఇది చాపకింద నీరులా వచ్చే పరిణామం. ఎముకలు పలచబారడం దీర్ఘకాలం జరుగుతూ పోతే చిన్న గాయలకే ఎముకలు విరిగే ముప్పు పెరుగుతుంది. చిన్నపాటి ప్రమాదానికే ఎముక తేలిగ్గా విరిగిపోతుంటే దాన్ని ఆస్టియోపోరోసిస్‌గా గుర్తించవచ్చు. ఇక లక్షణాలు.
ఒళ్లు నొప్పులు (జనరలైజ్‌డ్ బాడీ పెయిన్స్) ఎముకలు, కీళ్ల నొప్పులు (బోన్ అండ్ జాయింట్ పెయిన్స్).
అలసట (ఫ్యాటిగ్‌నెస్) చిన్న ప్రమాదానికే ఎముక విరగడం విపరీతమైన వెన్ను నొప్పి, కాస్తంత వెన్ను ఒంగినట్లయి శరీరం ఎత్తు తగ్గడం.
ఆస్టియోపోరోసిస్ ముదిరిపోయే వరకు వ్యాధి లక్షణాలు బయటపడవు. కానీ, వెన్ను, వీపు భా గంలో ఎముకల పెళుసుబారినట్లు అనిపించడం, మణికట్టు, తుంటిభాగాల్లో ఎము కల కూర్పులో మార్పులు, గూని.. లాంటివి ఆస్టియోపోరోసిస్‌కు హె చ్చరికలుగానే గుర్తించాలి. ఈ రుగ్మత ప్రభావాన్ని గుర్తించేందుకు సీటీ స్కాన్, మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ) చేస్తారు.
కారణాలు
వయసు పైబడటం ఎముకలు గుల్లబారటానికి అతి పెద్ద ము ప్పు కారకం. ముప్ప యి ఏళ్ల తర్వాత ఎము క సాంద్రత ఏటా ఒక శాతం చొప్పున తగ్గు తూ ఉంటుంది. దీంతో గుల్లబారే ముప్పూ పెరుగుతూ వస్తుంది. దాటాక ఇది మరింత తీవ్రమవుతుంది.
మగవారి కన్నా ఆడవారికి ఎముకలు గుల్లబారే ముప్పు ఎక్కువ. దీనికి కారణం నెలసరి నిలిచిన తరవాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గణనీయంగా తగ్గిపోవడం. ఈస్ట్రోజన్ ఎముక విచ్ఛిన్నం కాకుండా.. క్షీణించకుండా కాపాడుతుంది. నెలసరి నిలిచాక దీని రక్షణ కొరవడుతుంది.
కండరాల మోతాదు తక్కువగా ఉండటం, బలహీనం గా, ఒక్కపలుచగా ఉండటమూ ఎముక క్షీణతకు దారితీస్తుంది. అందుకే లావుగా ఉండేవారితో పోలిస్తే సన్నగా ఉండేవారికి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
ఎముక ఆరోగ్యానికి
ఎముక నిర్మాణంలో క్యాల్షియం చాలా కీలకం. సాధారణ వ్యక్తులకు రోజుకు 600 మి.గ్రా క్యాల్షియం అవసరం. కౌమార పిల్లలకు, గర్భిణులకు, నెలసరి నిలిచినవారికి రోజుకు 1,200 మి.గ్రా కావాలి. కానీ మనదేశంలో సగటున 400 మి.గ్రా. మాత్రమే తీసుకుంటున్నారు.
దీనికి ప్రధాన కారణం పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్ వంటివి తగినంత తీసుకోకపోవడం. మనం తినే ఆహారంలో వీటితోనే 70 శాతం క్యాల్షియం లభిస్తుంది. మిగతా పదార్థాల్లో కొద్దిగానే ఉంటుంది. మాత్రల కన్నా ఆహారం ద్వారా లభించే క్యాల్షియమే ఆరోగ్యానికి మంచిది. దీన్నే శరీరం బాగా గ్రహిస్తుంది.
మహిళల్లో..
ఆరోగ్య సమస్యలనగానే ఎంతసేపూ గుండెపోటు, క్యాన్సర్ వంటి తీవ్ర జబ్బులే గుర్తుకొస్తాయి. కానీ ఆస్టియోపోరోసిస్ తక్కువేమీ కాదు. మనదేశంలో ఆడవారిలో ప్రతి ఇద్దరిలో ఒకరు.. మగవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు దీంతో బాధపడుతున్నారు.
గుండెపోటుతో పోలిస్తే ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్లు రెండింతలు ఎక్కువ. రొమ్ముక్యాన్సర్ కన్నా ఇవి 2 రెట్లు ఎక్కువ. ఈ ఫ్రాక్చర్లు అప్పటికప్పుడు ప్రాణాల మీదికి తేకపోవచ్చు కానీ అసలే ప్రాణహాని ఉండదని అనుకోవడం పొరపాటు. తుంటి ఎముక విరిగినవారిలో 20శాతం ఏడాదిలోపే మరణిస్తుండటం విచారకరం.
డాక్టర్ చిన్నమరి రాహుల్ రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్స్ సర్జన్, ప్రాణహిత హాస్పిటల్స్, మేనేజింగ్ డైరెక్టర్, చైతన్యపురి, హైదరాబాద్