calender_icon.png 1 July, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులతో ఎందుకు చర్చించరు?

01-07-2025 02:45:19 AM

  1. పాకిస్థాన్‌పై యుద్ధాన్ని ఆపి.. మన బిడ్డలను చంపుతారా?
  2.   25 వేల మందితో ఎల్బీ స్టేడియంలో సభ
  3. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడి 

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. ట్రంప్ చెప్పాడని పాకిస్థాన్‌పై యుద్ధాన్ని ఆపిన ప్రధాని మోదీ ప్రభుత్వం.. వామపక్ష ఉద్యమాల్లో మన పౌరులను ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేస్తారా అని నిలదీశారు.

ఈ నెల 4న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్‌కు రానుండటంతో ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లను మంత్రులు వాటికి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, శివసేనారెడ్డి లతో కలిసి మహేష్‌కుమార్‌గౌడ్ సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఫాసిస్ట్ మోదీ పాలనను ఎండగట్టేందుకు ఖర్గే ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు చెపితేనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమత్రి అమిత్‌షా పాకిస్థాన్‌తో యుద్ధం ఆపేశారని విమర్శించారు. కాల్పుల విరమణకు తాము సిద్ధమని, కేంద్రం తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు లేఖలు విడుదల చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఈ నెల 4న ఎల్బీస్టేడియంలో నిర్వహంచబోయే సభకు గ్రామ శాఖ, మండల, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి నేతలు మొత్తం 25 వేల మంది వరకు హాజరవుతారని తెలిపారు. సభకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.