ఎల్‌ఐసీ లాభం రూ.13,763 కోట్లు
న్యూఢిల్లీ, మే 27: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను సోమవారం వెల్లడించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ రూ.13,763 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.13,428 కోట్ల నికర లాభం పొండగా, ఈ సారి 2.5 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.2,00,185 కోట్ల నుంచి రూ.2,50,923 కోట్లకు పెరిగినట్టు ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పొందుపరిచింది.
భారీగా పెరిగిన రెన్యూవల్ ప్రీమియం
ఎల్‌ఐసీ రెన్యూవల్ ప్రీమియం వసూళ్లు భారీగా పెరిగాయి. సమీక్ష త్రైమాసికంలో తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ. 13,810 కోట్లుగా నమోదు అయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.12,811 కోట్లుగా ఉంది. రెన్యూవల్ ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయం రూ.76,009 కోట్ల నుంచి రూ.77,368 కోట్లకు పెరిగింది. అంటే ఏకంగా రూ.100 కోట్లకుపైగా వృద్ధి నమోదైంది. ఇక, 2023 ఆర్థిక సంవత్సరానికి ఎల్‌ఐసీ రూ.40,676 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఎల్‌ఐసీ నికర లాభం రూ.36,397 కోట్లు ఉంది. ఇక తుది డివిడెండ్ కింద ఒక్కో షేరుకు 6 రూపాయల చొప్పున ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది.






