30 June, 2026 | 2:19 AM

తిరిగి కొండెక్కిన వెండి

29-05-2024 12:05 AM

హైదరాబాద్, మే 28: వారం రోజుల క్రితం భారీగా పెరిగిన తర్వాత క్రమేపీ తగ్గిన వెండి, బంగారాలు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం కొంత మేర పెరిగిన ఈ రెండు లోహాలు మంగళవారం మరింత ఎగిసాయి. ముఖ్యంగా వెండి ధర జోరుగా పెరిగింది. మంగళవారం హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో  కేజీ వెండి ధర ఒక్కసారిగా రూ.3,500 పెరిగి రూ.1,01,000 రికార్డుస్థాయిని అందుకున్నది. సోమవారం ఇది రూ.1,500 పెరిగింది. రెండు రోజుల్లో మొత్తం రూ.5,000 ఖరీదయ్యింది. మరోవైపు  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 అధికమై రూ.72,930 వద్ద నిలిచింది. 10 రోజుల క్రితం పసిడి రూ.75,160 స్థాయికి చేరి కొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.200 పెరిగి రూ.66,850 స్థాయికి చేరింది. 

ప్రపంచ మార్కెట్ల ఎఫెక్ట్

ప్రపంచ మార్కెట్లో వెండి ధర దూసుకుపోతున్నందున, స్థానిక మార్కెట్లలో సైతం వరుసగా రెండు రోజుల పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సు ధర 5 శాతం మేర పెరిగి 32.20 డాలర్ల వద్దకు చేరుకున్నది. మరోవైపు ఔన్సు బంగారం ధర 15 డాలర్ల వరకూ పుంజుకుని 2,360 డాలర్లస్థాయికి చేరింది. 

కీలకమైన యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాల కోసం బులియన్ ట్రేడర్లు ఎదురుచూస్తున్నారని, ఈ డేటాతో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెరడల్ రిజర్వ్ ఎంత త్వరితంగా వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు ఏర్పడతాయని, ఆ అంచనాలు బంగారం, వెండి ట్రెండ్‌లను నిర్దేశిస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి వివరించారు. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం బంగారం ధరల్ని ప్రభావితం చేసిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్, కరెన్సీ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పారు.