calender_icon.png 3 November, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్‌పోస్టుల ఎత్తివేత భద్రతకు ముప్పే!

24-10-2025 12:00:00 AM

వెంకగారి భూమయ్య :

* ఏఎన్‌పీఆర్ విధానం ఎంత అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టం అయినప్పటికీ, ఇది కేవలం నంబర్ ప్లేట్లను మాత్రమే గుర్తించగలుగుతుంది, కానీ అక్రమ రవాణా కార్యకలాపాలను, మానవ తప్పిదాలను గుర్తించలేదు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ర్ట భద్రతకు తీవ్ర ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టంలోని అంతర్రాష్ర్ట ఆర్టీఏ చెక్ పోస్టులన్నింటినీ హుటాహుటిన ఎత్తివేస్తూ, వాటి స్థానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నుజేషన్ (ఏఎన్‌పీఆర్) అనే అత్యాధునిక సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం రాష్ర్ట రవాణా వ్యవస్థలో తీవ్ర చర్చకు దారితీసింది.

రవాణా శాఖ కమిషనర్ అక్టోబర్ 22న జారీ చేసిన ఈ ఉత్తర్వులు, ఒకవైపు రవాణాలో పారదర్శకతను పెంచే ప్రయత్నంగా కనిపిస్తున్నా, మరోవైపు వందలాది మంది సిబ్బంది భవిష్యత్తు, రాష్ర్ట భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ నిర్ణయం కేవలం ‘సాంకేతిక సంస్కరణ’ కాదని, పాత ఉద్యోగుల భవిష్యత్తును బలి తీసుకుంటూ, భద్రతా వ్యవస్థను బలహీనం చేసే ఆందోళనకరమైన ప్రయోగంగా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చెక్‌పోస్టుల ఎత్తివేతతో అక్రమ రవాణా కార్యకలాపాలు విచ్చలవిడిగా పెరిగిపోయి రాష్ట్ర భద్రతకు ముప్పు గా పరిగణించవచ్చు.

ప్రమాదంలో ఉద్యోగులు

ప్రభుత్వం అధికారికంగా అంతర్రాష్ర్ట చెక్ పోస్టుల వద్ద పనిచేస్తున్న సుమారు 70 మంది ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఇతర రెగ్యులర్ సిబ్బందిని రవాణా శాఖలోని ఖాళీ పోస్టుల్లో నియమిస్తామని ప్రక టించింది. ఈ ప్రకటన వినడానికి ఊరట నిచ్చినా, ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ 70 మంది కాకుండా, ఈ చెక్ పోస్టుల మీద ఆధారపడి జీవనం సాగించే కాంట్రాక్ట్ సిబ్బంది, దినసరి కార్మికులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి వం దలాది మంది కార్మికుల ఉపాధి పూర్తిగా ప్రమాదంలో పడినట్లే.

వీరికి కొత్త ఉద్యోగాల గురించి ప్రభుత్వం ఎక్కడా స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో, ఆయా కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి కనిపి స్తుంది. ఏళ్ల తరబడి సరిహద్దు ప్రాంతాలలో పనిచేసి, అక్కడే స్థిరపడిన ప్రభుత్వ ఉద్యోగులను, సరైన ప్రత్యామ్నాయ శిక్షణ లేకుండా కొత్త టెక్నాలజీ ఆధారిత పాత్రల్లోకి బలవంతంగా నెట్టడం అనేది మాన వతా దృక్పథాన్ని పూర్తిగా విస్మరించడమే అవుతుంది.

ఒక ఉద్యోగికి తన ప్రాం తంలో, తనకు అలవాటైన పనిలో భద్రత లేకుండా, కొత్త బాధ్యతల పేరుతో దూర ప్రాంతాలకు బదిలీ చేయబడటం ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. రవాణాలో పారదర్శకత అనేది ముఖ్యం అయినప్పటికీ, పారదర్శకత పేరుతో వందలాది కుటుంబాల జీవితాలను బలి చేయడం ఎంతవరకు సమంజసమనే తీవ్రమైన ప్రశ్న వినిపిస్తోంది.

అక్రమాలను అడ్డుకోగదా?

అంతరాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఎత్తివేతతో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉంటాయి. రవాణాశాఖ మొత్తం ఆదాయంలో చెక్‌పోస్టుల నుంచి వచ్చేది 0.83 శాతం. అయితే శాఖ ఉద్యోగుల్లో ఏకంగా 17 శాతం మంది చెక్‌పోస్టుల్లోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు రవాణా, టూరిస్టు వాహనాలకు అనుమతులు సులభంగా, పారదర్శకంగా లభిస్తాయి. అక్కడి సిబ్బందిని రహదారి నియంత్రణకు, మోటారు వాహనాల చట్టం నిబంధనల అమలుకు ఉపయోగించుకోవచ్చు.

ఆర్టీఏ అధికారుల అక్రమ వసూళ్లు ఆగిపోతాయి. ఇక చెక్‌పోస్టులు తొలగించిన చోట ఏఎన్‌పీఆర్ కెమెరాలతో నిఘా పెడతారు. అనుమతులు తీసు కోకుండా వచ్చే వాహనాలు గుర్తించేలా ఏఎన్‌పీఆర్ ఉపయోగపడనుంది. అయితే ఏఎన్‌పీఆర్ విధానం ఎంత అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టం అయినప్పటికీ, ఇది కేవలం నంబర్ ప్లేట్లను మాత్రమే గుర్తించగలుగుతుంది, కానీ అక్రమ రవాణా కార్యకలా పాలను, మానవ తప్పిదాలను గుర్తించలేదు.

ఈ విషయంలో ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం రాష్ర్ట భద్రతకు తీవ్ర ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దుల్లో పనిచేసే అధికారులు కేవలం పర్మిట్లను మాత్రమే కాకుండా, వాహనంలోని వ్యక్తులను, సరుకును కళ్లారా చూసి అనుమా నం వస్తే తనిఖీ చేస్తారు. అంతర్రాష్ర్ట చెక్ పోస్టులు లేకపోవడంతో, అంతరాష్ర్ట దొంగతనాలు, అక్రమ చొరబాట్లు యథేచ్ఛగా సాగే ప్రమాదం ఉంది.

ఒకవేళ దొంగిలించిన వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు వాడినా, లేదా కెమెరా కండ్లు కప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ర్టంలోకి ప్రవేశిస్తే, ఈ టెక్నాలజీ ఏ మాత్రం పనిచేయదు. అంతర్జాతీయ చెక్ పోస్టుల వద్దే డ్రగ్స్, దొం గతనాలు, అక్రమ చొరబాట్లు జరుగుతుండగా, అంతర్రాష్ర్ట సరి హద్దుల్లో మానవ నిఘా తగ్గితే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అక్రమ సరుకు సరఫరా విషయం లో కూడా ఏఎన్‌పీఆర్ నిస్సహాయంగానే ఉంటుంది. 

పునరాలోచన అవసరం

ఏన్‌పీఆర్ వ్యవస్థలో భద్రతా లోపాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం మొబైల్ స్క్వాడ్‌లను రంగంలోకి దించుతామని చెబుతోంది. అయితే రాష్ర్ట సరిహద్దులు దాదాపు వేలాది కిలోమీటర్లు ఉండగా, కేవలం కొద్ది సంఖ్యలో ఉండే మొబైల్ స్క్వాడ్‌లు, ఇతర మార్గాల ద్వారా రాష్ర్టంలోకి వచ్చే వేలాది వాహనాలను అడ్డుకో వడం అనేది సాధ్యం కాని పని. అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టం ద్వారా సమస్యలు గుర్తించినప్పటికీ, దానిని క్షేత్ర స్థాయిలో పరి ష్కరించేందుకు మానవ వనరులు సరిపడా లేకపోతే, ఎంత టెక్నాలజీ వాడినా ఉపయోగం మాత్రం శూన్యం.

‘ఎన్ని టెక్నాలజీలు వచ్చినా అడ్డదారులను అడ్డుకోగ లమా?’ అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతుంది. కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా దానిని అధిగమించేందుకు అక్రమార్కులు ఎప్పుడూ కొత్త దారులను వెతుకుతూనే ఉంటారు. పారదర్శకత కోసమని చెక్ పోస్టులను తొలగించడం.. వాస్త వానికి నిఘా, భద్రతా వ్యవస్థను బలహీనం చేయడమన్నట్లే.

ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించి, ఉద్యోగుల జీవితాలు, రాష్ర్ట భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు, భద్రతా విశ్లేష కులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఈ నిర్ణయం రవాణా సౌలభ్యం కంటే, సమస్యల సంక్లిష్టతనే పెంచుతుందనేది నిస్సందేహంగా చెప్పవచ్చు.

 వ్యాసకర్త సెల్: 9848559863