24-10-2025 12:00:00 AM
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ విపక్ష కూటమి ‘మహాఘట్ బంధన్’ తన స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో, సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య సఖ్యత కుదరనప్పటికీ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వీ యాదవ్ పేరును ఖరారు చేసింది. కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో తొలుత కాంగ్రెస్ మౌనం వహించినప్పటికీ బీహార్ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకుడైన అశోక్ గహ్లోత్ పరిణామాలన్నింటికి చెక్ పెడుతూ సీఎం అభ్యర్థిగా తేజస్వీ పేరును ప్రకటించి ఉత్కంఠకు తెర దించారు.
‘మహాఘట్ బంధన్ తరఫున సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్.. మరి మీ కూటమి తరఫున సీఎం ఎవరు?’ అంటూ అశోక్ గహ్లోత్ ఎన్డీయేకు సవాల్ విసరడం గమనార్హం. మరోవైపు ఎన్డీయే కూటమి ఇప్పటికీ సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆలస్యం ఎందుకన్నది అర్థం కాని విషయం. బీహార్‌కు అత్యధిక కాలం సీఎంగా సేవలందించిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కు మరో చాన్స్ ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
నితీశ్ మద్దతుదారులు మాత్రం ఆయనే మళ్లీ సీఎం అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తు న్నప్పటికీ, ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచినా నితీశ్ సీఎం అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ‘నితీశ్ మా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ముందుగా తమ పార్టీ నాయకులను ఎన్నుకుంటారు.
తర్వాత వారంతా కలిసి సీఎం ఎవరన్నది నిర్ణయిస్తారు’ అని అమిత్ షా తెలిపారు. ఎల్జేపీ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకే వంత పాడారు. కూటమి పార్టీలైన హిందుస్తానీ ఆవామ్ మోర్చా అధినేత, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మాత్రం సీఎం అభ్యర్థి ఎవరనేది ముందే ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రీయ లోక్‌మంచ్ జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా మాత్రం నితీశ్ మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు.
ఇలా ఎన్డీయే కూటమిలో ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా మాట్లాడడంతో సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. గతంలో ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్’ పార్టీ బీహార్ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతుంది. ఈసారి ఎన్నికల్లో జేడీయూకు పరాభవం తప్పదని, ఆ పార్టీకి 25 సీట్లు కూడా రావని, నితీశ్ మళ్లీ సీఎం అవ్వడం కష్టమేనని తేల్చిచెప్పారు. ప్రశాంత్ కిషోర్ చేపట్టిన సర్వేలు చాలా ఎన్నికల్లో నిజమయ్యాయి.
అదీగాక నితీశ్ తన అవసరానికి గోడ మీద పిల్లిలా వ్యవ హరించిన సందర్భాలు కోకొల్లలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత ఆర్జేడీతో చేతులు కలిపిన నితీశ్ ఆ తర్వాత అధికారం కోసం ఎన్డీయే పంచన చేరిన సంగతి తెలిసిందే. ఇవన్నీ బేరీజు వేసుకొని ఎన్డీయే కూటమి తమ సీఎం అభ్యర్థి ఎవరన్నది చెప్పడానికి సంకోచిస్తుంది.
ఒకవేళ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలు సాధించి, జేడీయూ తక్కువ సీట్లు వస్తే నితీశ్‌కు సీఎం పదవి కట్టబెడతారా అన్నది అనుమానమే. మొత్తంగా నవంబర్ 14న ఫలితాలు వెలువడిన తర్వాతే ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్థి ఎవరనేది తేలనుంది.