24 April, 2026 | 5:06 AM

సాహిత్య చక్రవర్తి బూర్గుల రామకృష్ణారావు

10-03-2025 12:00 AM

“ఒక సాహిత్యక చక్రవర్తి ప్రభువై

యున్నాడు మా రాష్ట్ర ల 

క్ష్మి కటం బెంతయు పొంగి పోయెదను 

నీ మేధావిలాసంబు లాం 

ధ్రికి దివ్యా భరణములై 

తెలుగు ధాత్రిన్ వెల్లి, వెల్గించి భా 

వికి వేరెట్లుగు మేలు కూర్చుచు 

జన ప్రీతిన్ బ్రసాదించుతన్‌”

బూర్గుల రామకృష్ణారావు ప్రధానంగా సాహిత్యికులు. విద్యార్థి, లాయరు, ప్రజానాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ వేత్త, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నరు, పార్లమెంటు సభ్యుడుె ఈ దశలన్నిటిలోనూ ఆయ న రచనలు చేస్తూ వచ్చారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలలో రచనలు చేశారు. ఈయన లాయర్ కాకపోయినట్లయితే, రాజకీయ ప్రజా జీవితంలో అడుగిడక పోయినట్లయితే, సర్వేపల్లి రాధాకృష్ణన్ వలె, అకడమిక్ రంగంలో అనగా విద్యా పాండిత్య రంగాలలో ప్రముఖులయ్యే వారనుకుంటాను. అన్ని భాషలలో రచన చేయకుండా, ఏ ఒక్క భాషలోనో కృషి చేసి ఉంటే ఆ భాషా రంగంలో జాతిరత్నం వలె ప్రకాశించే వారేమో! వారి జీవయాత్రలో గ్రంథపఠనం, సాహిత్యాధ్యయనం, తోచిన రచన చేయడం, నిత్యాభ్యాసాలుగా ఉండేవి. వ్రాసింది ప్రతీదీ ప్రకటించే అలవాటు వారికి ఉండేది కాదు. తమ ఆనందం కోసం వ్రాసుకొని, ఆత్మీయులైన కవి పండితులకు వినిపిస్తూ ఉండేవారు.

రామకృష్ణారావు ఎక్కడో ఒకచోట చెప్పుకున్నారు. “నాకు గూడా వ్రాసే గుణం ఉండి, ఏదో ఒకటి వ్రాస్తూ ఉండేవాడిని” అని. ఆ వ్రాసే గుణం బీవితంలో అంతిమ దశవరకూ వారికి అలాగే ఉండిపోయింది. పాశ్చాత్యుల Man of letters అనే మాట వీరి విషయంలో పూర్తిగా సార్థకమైంది. తీరిక దొరికిందంటే అధ్యయనం, రచన వారికి అభిమాన వ్యాపకాలుగా ఉండేవి. కవి సమ్మేళనాలలో, చర్చాగోష్టుల్లో ఉత్సాహం గా పాల్లొనేవారు. “నేనూ మీ వాడినే” అని చెప్పకుండానే సాహితీ బంధువర్గంలో కలిసిపోయి లాయరుగా, రాజకీయ నాయకునిగా తమకుగల ప్రత్యేకహోదా సంగతి మరిచి పోయేవారు. సాహిత్య సామ్రాజ్యంలో హెచ్చుతగ్గులు, సామాన్యులు  గొప్పవ్యక్తులు అనే భేదాలకు తావు లేదన్నట్లుగా ప్రవరించేవారు.

బూర్గుల వారు వారి 16వ యేటినుంచే తెలుగులో కవిత్వం, వ్యాసాలు వ్రాయ మొదలుపె ట్టారని చెప్పవచ్చు. పూనాలో చదువుకునేటప్పుడు సెలవుల్లో ఇంటికి వస్తే ‘శారద’, ‘భారతి’, ‘సుజాత’ వంటి సాహిత్య పత్రికలు ఇష్టంగా చదివేవారు. తెలుగులో వెలువడుతూ ఉన్న రచనల తో మంచి పరిచయం కలిగి ఉండేవారు. సం స్కృత భాషాధ్యయనం చేసేవారు. అమరము, శబ్దమంజరి, ధాతు రత్నావళి, గీత గోవిందము, మేఘ సందేశము, రఘువంశము, శృంగార నైషధము పఠించేవారు. టాగూరు కవిత్వం, రాయప్రోలు, కృష్ణశాస్త్రి, ఉమర్ అలీషా వంటి తెలుగు కవుల ఖండకావ్యాలు అభిమానంగా చదివేవారు. పూనా ఫెర్గుసన్ కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడే ఇంగ్లీషులో కవితలు, కొన్ని సానెట్లు, ఆర్టు అండ్ క్రిటిసిజం వంటి వ్యాసాలు వ్రాసి కాలేజీ సంచికలలో ప్రకటించారు. 1920 మధ్య తెలుగులో ఖండకృతులు వ్రాసి ‘గోలకొండ పత్రిక’లో ప్రచురించారు. ఛందోబద్ధమైన రచనలివి. 1924లో ఆంగ్లకవి థామస్ గే ‘ఎలిజీ’ని ‘మృత సంస్మృతి’ అనే పేరుతో పద్యాలుగా ఆంధ్రీకరించారు.

1920లో వీరి మొదటి భార్య మృతి చెందిన తర్వాత వీరికి రచనా వ్యాసంగంపై శ్రద్ధ హెచ్చిం ది. పుంఖానుపుంఖంగా రచనలు చేశారు.

“చిన్నతనమ్మునన్ మురువు చేకుర 

పెండిలిసేసి రోలమై 

కన్నెగ నైన నీవు నతికాలము 

నుండగలేదు, వెంటనే

పిన్న వయస్సులోనె మరి పిల్లలు 

గల్గి సుఖింపకూరకే

నన్నును పిల్లలన్ విడిచి నాకము 

చేరితె ప్రేయసీ వెసన్.”

పై భావాలను ఆంగ్లంలోనూ ఆయన వ్యక్తీకరించారు.

బూర్గుల వారు రచించిన ‘కృష్ణ శతకము’ను హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు 1956లో ప్రచురించింది. ఇవి కంద పద్యాలు. మచ్చుకు ఒక పద్యం:

“జన సేవయె నీ సేవని

జనతా రాజ్యాధి భార జనిత క్లేశం

బున గ్రుంకు చుంటి నిత్యము

గని కరమున బరువు దింపి కావవె కృష్ణా”.

ఈ శతకంలో విషయ వాంఛా వ్యామోహం తో చిక్కుకునే మానవ స్వభావాన్ని గూర్చి ఇట్లా అన్నారు: 

“ఏమి మనస్సో హరి హరి

స్వామిని బడద్రోసి స్వారి సలిపెడు గుర్రం 

బేమో యనిపించును వడి

గామితముల వెంటబడుట గాంచిన కృష్ణా.”

వీరు సంస్కృతంలో రచించిన శ్రీ వేంకటేశ్వ ర సుప్రభాతమును బరంపురము గోల్కొండ వ్యాపారి శ్రీవైష్ణవ సమాజం వారు 1958లో ప్రచురించారు. రేడియోలో ప్రతి శనివారం వినే సుప్రసిద్ధ సుప్రభాతాన్ని దృష్టిలో ఉంచుకొని అదే మకుటంతో శ్లోకాలుగా రచించారు.

“ఆ నమ్రచూత తరుషండ ముపేత్య కల్యే 

పీత్వా‚ తిరుచ్య ఫలసార రసాత్మకావ్యమ్ పుంస్కోకిలాః శ్రవణ సుందర మాల వంతి 

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతమ్.”

వీటికి తెలుగు పద్యాలు కూడా వీరే 1955 లో వ్రాశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘శృంగగిరి శారదాస్తుతి’ సంస్కృతంలో రచించారు. ‘గౌరీస్తుతి’, ‘వాణీస్తుతి’, ‘లక్ష్మీస్తుతి’ కూడా వ్రాశారు. ‘భావమంజరీ’ సంస్కృతంలో వ్రాశా రు. కేరళలోని గురువాయూరు శ్రీకృష్ణ కేత్రాన్ని దర్శించినపుడు వీరు తెలుగులో ‘శ్రీకృష్ణాష్టకము’ రచించారు. ఒక పద్యం:

“వచ్చని యాకు లేజిగిని 

బారెడు నీటి పరాకు పాటలం 

దచ్చపు వెండి వెన్నెలల 

నామని బూచెడు పువ్వు నవ్వులో 

బిచ్చుక గొంతులో నొరుల 

బిచ్చము గోరెడు దీను నాల్కలో 

సచ్ఛరితాళి శుద్ధమగు 

స్వాంతములో గనిపింతు కేశవా!”

బూర్గుల వారి కృతులలో ప్రధాన గుణం వైష్టవ సంపదాయ ప్రేరితమైన భక్తి, ప్రపత్తులు. 

రామకృష్ణారావు విశ్వసాహిత్యంలో ప్రసిద్ధుడైన ఉమర్ ఖయాం రుబాయీలను ఆంగ్లాను వాదాల నుండికాక నేరుగా ఫారసీ భాషనుంచే (మొత్తం 101 రుబాయీలను) తీసుకొని తెలుగుపద్యాలుగా అనువదించారు. ఫారసీ, ఉర్దూ, సంస్కృతాంధ్రాంగ్ల ఆరబ్బీ భాషలలో చక్కని ప్రవేశం కలిగిన బూర్గుల వారు ఫారశీక భాషయందు గొప్ప విద్వాంసులు. అందువల్ల వీరి అనువాదం యథామూలంగా ఒక వైశిష్ట్యంతో ఒప్పారుతున్నది. మచ్చుకు ఒక వద్యం:

“సరసుడు మిత్రుడిష్టుడును

సన్నిహితుండొకరుండు లేక యొం 

టరిగను భూమి గర్భమున

డాగి పరుండెదవెన్ని యేండ్లొ, సీ 

ధు రసము ద్రావు మింపుగ, వ

ధూమణి తెల్పకు మీ రహస్యమె 

వ్వరికిని, విచ్చబోదికను

వాడిన పుష్పమదెన్ని నాళ్ళకున్.”

బూర్గులవారూ, దువ్యూరి రామిరెడ్డివారూ ఇద్దరూ ఫారసీ మూలం నుంచే ఉమర్ ఖయాం రుబాయీలను అనువదించారు. కాబట్టి, వీరి అనువాదాల తులనాత్మక పరిశీలనం చేసి సాహిత్యికులు ఆనందించవచ్చు. రామకృష్టారావు ఈ అనువాదాన్ని వారి పెద్ద కుమారులు బూర్గుల రంగనాథరావు, పెద్ద కుమార్తె ఇల్లిందల శ్యామాలాదేవిలు 1987లో ప్రచురించారు. 

రామకృష్ణారావు ఫారసీ సాహిత్యంలోని సూఫీ సర్మద్ రుబాయతులను కూడా తెలుగుపద్యాలుగా అనువదించారు. ఇవి బహుకాలం కిందట ‘కృష్ణా పత్రిక’లో ప్రచురితమైనవి. 1987 లో వారి కుమారులు బూర్గుల లక్ష్మీనారాయణరావు వీటిని పుస్తకంగా ప్రచురించారు. ఒక్కొక్క పుటపై ఫారసీ మూలము, ఉర్దూ వచనానువాదంతోపాటు బూర్గుల వారి పద్యం ఇచ్చారు. జగన్నాథ పండిత రాయలచే రచింపబడిన ‘లహరీ’ పంచకానికి బూర్గుల వారు 1959లో ఆంధ్ర పద్యానువాదం చేశారు. దీనిని ‘ఆంధ్ర రచయితల సంఘం’ ప్రచురించింది. ‘లక్ష్మీలహరి, కరుణాలహరి, సుధాలహరి, అమృతల హరి, పీయూషలహరి’ అనే అయిదు లహరులను తెనిగించిన వారు వీరొక్కరే. 

ఒక పద్యం:

“అమర తరంగిణీ పులిన

మందు సుఖాసనముండి కన్నులం 

దమరిచి యోగముద విష

యమ్ముల దల్చి హరించి లోని సం 

తమసము తత్సుఖాత్మక సు

ధారస నిర్ఘరినన్న వాంబుదో 

త్తమరుచి చిత్కళన్ మునిగి

ధన్యుడ నౌటది యెన్నడో కదా.”

శంకరాచార్యుల వారి ‘సౌందర్యలహరి’ని వీరు 1962లో తెనిగించారు. శంకరాచార్యుల ‘కనకధా రా స్తవము’నకు వీరు 1964లో ఆంధ్రా నువాదం చేశారు. వీరు వృత్తాలు, సీసములు, తేటగీతులు, ఆటవెలదులు, మత్తకోకిల, ద్విపదలు వ్రాశారు. చాటు పద్యాలు కూడా వ్రాశారు. నాటిక, ప్రహసనం, కథానిక వంటి ప్రక్రియలలో కూడా రచన లు చేశారు. అవి అచ్చు కాలేదు. 

బూర్గుల రామకృష్ణారావు రచించిన పరిశీలనాత్మక సాహిత్య వ్యాసాలు కొన్నిటిని హెదరా బాదు ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వారు ‘సారస్వత వ్యాస ముక్తావళి’ అనే పేరుతో దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రచురించారు. ఇందులో ‘నవీన వాఙ్మయము - యెంకి పాటయి’ అనే వ్యాసం చదవదగింది. ఎంకి పాటలపై ఆంధ్రదేశంలో దుమారం రేగినప్పుడు వ్రాసిన వ్యాస మిది. ‘కవిత్వం లాక్షణికుల సొమ్మా? వండితుల సొమ్మా?’ అని ప్రశ్నించి, వాడుక భాషను వాఙ్మయము నందుపయోగించుట తప్పు కానేరదని ఘంటాపథంగా చెప్పారు. ఎంకి పాటల ను విమర్శించిన పండితులను గూర్చి ప్రస్తావిస్తూ ‘కవి అనుభవమందు ఇంచుకైనా పాల్గొన లేనిది  విమర్శకుడు కాజాలడని’ స్పష్టం చేశారు. 19 పేజీలున్న ఈ వ్యాసం మొదట 1926 ఆగస్టులో ‘గోలకొండ పత్రిక’కు వ్రాయబడింది.

ప్రచురణ కాలం: 1989, ‘బహుముఖ 

ప్రజ్ఞాశాలి బూర్గుల’ జీవితచరిత్ర 

నుంచి సంక్షిప్తంగా..

‘ఇంటర్నెట్ ఆర్వైవ్’ సౌజన్యంతో..

-డి.రామలింగం