24 April, 2026 | 3:39 AM

చతుర్విధ కవిత్వ ప్రవీణుడు..కాణాదంపెద్దన సోమయాజి

10-03-2025 12:00 AM

“కాదివర్గంబు లిరువదియైదు విడిచి

చేసితి వపంచ వర్గీయ చిత్రకృతిని

‘శేషశైలేశ లీలా’ఖ్యచే నెసంగ

యాదిమితవర్ణ నియతి శక్యంబె జగతి”

అంటూ ‘ముకుంద విలాసము’ అనే కావ్యంలో కృతి కర్త అయిన కాణాదం పెద్దన సోమయాజి తనను గురించి, తన రచనా ప్రాశస్త్యాన్ని గురించి కృతిపతి నోట చెప్పించిన మాటలు ఈ పద్యంలో ఉన్నాయి.కాణాదం పెద్దన ప్రతిభ అసదృశమైంది. ఆయన కొంతకాలం సురపుర సంస్థాన కవిగా, మరికొంత కాలం గద్వాల సంస్థాన ఆస్థానకవిగా వెలుగు వెలిగిన ప్రతిభావంతుడైన కవి. ఆయన రచనలుగా తెలుస్తున్నవి ‘ముకుంద విలాసము’, ‘అధ్యాత్మ రామాయణము’, ‘యథాశ్లోక తాత్పర్య రామాయణము’ (బాలకాండము), ‘శేషశైలేశ లీల’ అనే ఐదు కృతులు. వీటి గురించి ‘ముకుంద విలాసము’లోని అవతారికవల్ల తెలుస్తున్నది.

‘శేషశైలేశ లీల’లో చిత్రకవిత్వ రీతులు

కాణాదం కవి రచించిన ‘శేషశైలేశ లీల’లో కవి ప్రతిభను స్పష్టం గా చెప్పే పద్యం పైన పేర్కొన్నది. కవిత్వాన్ని గురించి చెప్పిన అలంకార శాస్త్రాలుసహా చతుర్విధ కవితారీతుల్ని గురించీ చెప్పారు. ఆశు, చిత్ర, మధుర, బంధ కవిత్వాలలో తాను ప్రవీణుడనని చెప్పు కున్న పెద్దన పై పద్యంలో కొన్ని వివరాలు చెప్పాడు. తాను రచించిన ‘శేషశైలేశ లీల’ కావ్య రచనలో తా ను పాటించిన చిత్ర కవిత్వ రీతులను వివరించాడు. చిత్రకవితా రీతిలో కాణాదం పెద్దన నిర్మించిన ‘శేషశైలేశ లీల’ ప్రబంధంలో ‘కా’ది వర్గాన్ని విడిచిపె ట్టాడు. అంటే, ఆ కావ్యంలోని పద్యాల్లో క, చ, ట, ప అనే అయిదు వర్గాల్లోని అక్షరాలు రాకుండా పద్యాలు రాశాడన్న మాట! క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ’ అనే 25 అక్షరాలే లేకుండా కావ్యం మొత్తం పద్యాల్లో రాయడం అంటే అది మహాప్రతిభాశాలియైన కవికి మాత్రమే సాధ్యమవుతుంది. అంటే, ఈ కావ్యంలోని పద్యాలన్నీ కేవలం య, ర, ల, వ, శ, ష, స, హ అనే అక్షరాలతో మాత్రమే ఉంటాయన్న మాట. కావ్యం పేరైన ‘శేషశైలేశ లీల’లో కూడా ఈ అక్షరాలు మాత్రమే ఉన్నాయి.

‘అధ్యాత్మ రామాయణం’  చెన్నకేశవునికి అంకితం

కాణాదం పెద్దన రచించిన మరో కావ్యం ఆధ్యా త్మ రామాయణము. ఈ రచన చేసే నాటికి ఆయన సోమయాగం చేసి ‘సోమయాజి’ అయ్యాడు. సం స్కృతంలోని ‘అధ్యాత్మ రామాయణాన్ని’ తెలుగులో రచించి గద్వాలలో వెలసిన చెన్నకేశవునికి అంకితం చేశాడు. ఇందులో గద్వాల ప్రభువుల ప్రస్తుతి విస్తృతంగా కనిపిస్తుంది. ఈ రచన సీతాహనుమ త్సం వాదరూపంలో ఉంది. రామ హృదయాన్ని పరమశి వుడు పార్వతీమాతకు వినిపించినట్లు రాయడం విశేషం. ఒక విధంగా ఇది శివకేశవాద్వైతాన్ని బోధిస్తున్నట్టుగా ఉంటుంది. కవి ఇందులో రామగీతా తత్తాన్ని వివరించి, ఇది రామగీతా తత్తకావ్యంగా పేర్కొన్నాడు. కవి రచనకు గీటురాళ్లన దగిన శబ్దాలంకార ప్రయోజనాలు ఈ కావ్యంలో విస్తారంగా దర్శనమిస్తాయి. ఇవేగాక పెద్దన ‘యథాశ్లోక తాత్ప ర్య రామాయణము’లోని బాలకాండను రచించా డు. గద్వాల సంస్థానంలోంచి ఆరుగురు కవులు వాల్మీకి రామాయణాన్ని యథాశ్లోక రామాయణముగా అనువదించారు. వారిలో కాణాదం పెద్దన ఒకరు.

మూడు ఆశ్వాసాల ‘బాలకాండ’

ఈ ‘యథాశ్లోక తాత్పర్య రామాయణం’లోని బాలకాండ భాగాన్ని కాణాదం పెద్దన అనువదించాడు. ఇందులో మూడు ఆశ్వాసాలు ఉన్నాయి. పలు విధాలైన చమత్కారాలతో కూడుకున్న ఈ రచన కూడా గద్వాల చెన్నకేశవునికే అంకితమైనా, గద్వాల ప్రభువుల పూర్వసంస్థాన కేంద్రమైన ‘పూడూరు’ గ్రామంలోని చెన్నకేశవస్వామి ప్రస్తుతి కూడా ఇందులో కనిపిస్తుంది. 

వీటికన్నా పూర్వమే కాణాదం పెద్దన ‘ముకుంద విలాస’ కావ్యాన్ని రచించి సాహితీ ప్రపంచానికి అందించాడు. ఇందులోని ఇతివృత్తం శ్రీకృష్ణుడు భద్రను వివాహమాడటమే. అందుకే, ఈ కావ్యానికి ‘భద్రాపరిణయము’, ‘భద్రా పరిణయోల్లాసం’ అని నామాంతరాలు ఉన్నట్లు సాహిత్య చరిత్రకారులు పేర్కొన్నారు. గద్వాల ప్రభువైన చినసోమ భూపాలుని కోరిక మేరకు విరచితమైన ఈ మూడు ఆశ్వా సాల ప్రబంధం మొట్టమొదటిసారి 1886లో గద్వాలలోని ‘శ్రీవిద్యా ముకుర ముద్రాక్షర శాల’లో ముద్రితమైంది. ఈ రచనకూడా గద్వాల చెన్నకేశవునికే అంకితం. ఈ కావ్యం కాణాదం పెద్దన ‘సోమ యాజి’ కాకపూర్వం రచించింది. ఇందులోని గద్య లో “ఇది శ్రీమదుభయ కవితా నిస్సహాయ సాహితీవిహార కాణాదాన్వయ తిమ్మనార్య కుమార వినయ గుణధుర్య పెద్దనార్య ప్రణీతంబైన..” అని చెప్పుకున్నారు.

దీనినిబట్టి ఈ కావ్యం ఇతర కావ్యాలకన్నా పూర్వరచనగా సాహితీ విమర్శకులు నిర్ధారించారు. సాధారణంగా కళ్యాణ కావ్యాల పేర్లు ‘కల్యాణము’, ‘పరిణయము’ అని పెడుతుంటారు. ఆరుద్ర అన్న ట్లు పెద్దన పరిణయేతి వృత్తమైన తన కావ్యానికి ‘ముకుంద విలాసము’ అని పేరు పెట్టారు. ఇది ఈ కావ్య నామంలోని విశేషం. కాణాదం కవి ప్రతిభ ప్రతి పద్యంలోనూ కనిపించే కావ్యం ఈ ‘ముకుంద విలాసం’. “వినుత ప్రబంధ రీతుల నొనరింపుచు, గీతయోగ్య స్ఫూర్తిని గల్గించునట్టి రచన గావించెద” నని పెద్దన చెప్పుకోవడమేగాక “ప్రసంగ సంగీత శృంగార చమత్కార రసబంధురంగా నొనరింపబూనుదు”నని కూడా స్పష్టంచేశారు. దీనినిబట్టి ఇతడు కూడా వసు చరిత్రకారుడైన రామరాజభూషణుని కోవలోని వాడుగా సాహిత్యానికి సంగీత పరిమళాన్ని అద్దిన కవిగా గుర్తింపు పొందాడు.

భద్రా పరిణయానికి కావ్యరూపం ‘ముకుంద విలాసము’

పోతన భాగవతంలోనూ, వేదవ్యాసుల మూలంలోనూ ఒక్క పద్యం, ఒక్క శ్లోకానికే పరిమితమైన భద్రా పరిణాయానికి కావ్యరూపమిచ్చి ఈ కథకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రబంధం ‘ముకుంద విలాసము’. కాణాదం కవి వలెనే భద్రా పరిణయ వృత్తాంతాన్ని తాళ్లపాక చిన్నన్న ‘అష్టమహిషీ కల్యా ణం’, కాళ్లకూరి గౌరీనాథునికి సంబంధించిన పూర్వకవులెవరో రచించిన ‘భద్రా పరిణయము’, అల్ల మరాజు  సుబ్రహ్మణ్య కవి రచించిన ‘భద్రా పరిణయము’ అనే రచనలు ఉన్నా తొలి కావ్యం మాత్రం ‘ముకుంద విలాసమే’నని ఆచార్య రవ్వా శ్రీహరి నిర్ధారించారు. ఈ సంగతిని కృతిపతి నోటనే పలికించిన పద్యమే తెలుపుతున్నది.

“పురుషోత్తమాష్టమహిషీ

పరిణయములలోన మున్ను భద్రాదేవీ

పరిణయ మెవ్వరు తెనుగున

విరచించుట వినము పూర్వవిబుధుల లోనన్‌”

అన్న కాణాదం వారి కావ్యావతారికలోని ఈ పద్యమే ఈ విషయంలో సాధికారికమైన ప్రమా ణం. 

అశేష ప్రతిభను కాణాదం పెద్దన ‘ముకుంద విలాసము’ కావ్యంలో ప్రదర్శించాడు. గర్భిత పద్యా లు, బంధ కవిత్వాలకు తన రచనలో స్థానాన్ని కల్పిం చి, కావ్యశోభను పెంచడమేగాక తెలుగు పద్యం ఎంత శక్తివంతమైందో తెలియబరిచాడు. శేషబం ధం, శైలబంధం, పుష్పగుచ్ఛబంధం, చక్రబంధం, గోమూత్రికాబంధం, సర్వతోభద్రబంధం వంటి బంధ కవిత్వాన్ని ప్రదర్శించి ‘చతుర్విధ కవిత్వ ప్రవీణుడ’న్న మాటను నిలబెట్టుకున్నాడు. “ఈతని కవి త్వంలో నున్నన్ని శబ్దాలంకారములు మఱియే గ్రం థములోను లేవు” అన్న కందుకూరి వీరేశలింగము మాటలు కాణాదం పెద్దన ప్రతిభకు దర్పణాలు.

శ్లేష చమత్కారాలు

‘ముకుంద విలాసము’లో భాషా విషయకంగా, ఛందో విషయకంగా ఎన్నో విశేషాలు న్నాయి. శ్రవణ సుభగత్వం కోసం కవి అనేక పద్యాల్లో ద్వి, త్రి ప్రాసలను ప్రయోగించారు. తద్వారా పద్యానికి నాదమాధుర్యాన్ని సంతరించి పెట్టాడు. నాదమాధుర్యం కోసం పలు శబ్దాలంకారాలు కవి ప్రయోగించినా అర్థ సౌందర్యార్థం శక్తివంతమైన అర్థాలంకారాలను కూడా సమర్థమైన రీతిలో ప్రయోగించి, కావ్య ఔన్నత్యాన్ని రెండింతలు చేశాడు. శ్లేష చమత్కారంపై ఎక్కువ మక్కువ కలిగిన పెద్దన కవీంద్రుడు

“ఒక్క యేట జిక్కె మీనము

నొక్క నెలకె జిక్కె పద్మమొక పగటింటన్

వికలత జిక్కెంగుముదము

సకినయన సమం బులగునె జడగతు లెపుడున్‌”

అంటూ కావ్య నాయిక నయనాల సొగసును వర్ణించే పద్యంలో చక్కని శ్లేషను నిబద్ధించడం ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. భద్రాదేవి నేత్ర సౌందర్యంతో పోటీ పడాలనుకు న్న చేప ప్రయత్నించి ఒక్క సంవత్సరంలో (ఏట)నే చిక్కిపోయిందట! తామర పువ్వు ఒక్క నెలకే చిక్కి పోయిందట! కలువ పువ్వుతై ఒక్క రోజులోనే చిక్కి పోయిందట! శ్లేషవల్ల ‘ఏట’ (నీటిలో) జిక్కె అన్నప్పుడు ‘నెల’ (చంద్రుడు)కు చిక్కిందట! ఇక్క డ నెల శబ్దంతో శ్లేష సాధించాడు కవి. ‘పగటింటన్’ అన్న మాటనుబట్టి కలువ పగటి పూటనే చిక్కిపోయిందట! ఈ పద్యంలోనే అర్థాలంకార ప్రయోగంతో అర్థాన్ని శ్లేషద్వారా సాధించాడు.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు, 9949013448