24 August, 2026 | 1:51 AM

చిన్న చిన్న అద్భుతాలు

24-08-2026 12:00 AM

ప్రపంచాన్ని మార్చేస్తామని చెప్పే పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం నాకు రాదు నాకు ఇష్టం కూడా లేదు !

ఉదయం.. నువ్వు వంటింట్లో నవ్వినప్పుడు కప్పులోని టీ చల్లారిపోవడం ఇష్టం

మాటలు అయిపోయిన తర్వాత కూడా మన మధ్య కూర్చుని వుండే మౌనం ఇష్టం

రాత్రి నిద్రలో తెలియకుండానే నీ చేయి నా చేతిని వెతుక్కుంటూ రావడం ఇష్టం

ఉతికిన దుప్పటి వాసనలో వాన తర్వాత తడిసిన మట్టిలో ఇంటిముందు పూసిన పువ్వులో జీవితం తన సంతకం పెట్టడం ఎంతో ఇష్టం

సాయంత్రం.. నువ్వు పిలిచిన నా పేరు అమ్మ గుర్తుకొచ్చిన ఒక క్షణం

స్నేహితుడు పంపిన రెండు పలకరింపులు ఇవి చాలు !

ఎందుకంటే? సంతోషాలెక్కడో ఆకాశంలో ఉండవు !

ప్రతిరోజూ సాధారణంగా కనిపించే క్షణాల్లోనే ఆనందపు అద్భుతాలు 

దాగివుంటాయి మనం వాటిని ప్రేమ అని పిలుస్తాం

జీవితమని పిలుస్తాం సంతోషమని కూడా  పిలుస్తాం

కానీ.. అవన్నీ చిన్న చిన్న అద్భుతాలే !!