07-01-2026 12:47:53 AM
డెహ్రాడూన్, జనవరి 6: గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేసినంత మాత్రాన ఆలయ చరి త్ర కనుమరుగవదని, ఆలయం జాతి ఆత్మకు ప్రతీక అని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి మహరాజ్ ప్రక టించారు. మోదీ వ్యాఖ్యలు భారతీయుల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉన్నాయని కొని యాడారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
వెయ్యేళ్ల క్రితం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడి హిందూ సమాజానికి తీరని వేదన మిగిల్చిందని ఆయన గుర్తు చేశారు. గజనీ తన సైన్యంతో వచ్చి పవిత్రమైన ఆలయాన్ని ధ్వంసం చేశాడని, అక్కడి పూజారులను పొట్టనపెట్టుకున్నాడని పేర్కొన్నారు. భక్తులను హింసించాడని, అతి ప్రాచీనమైన దేవతా విగ్రహా లను నాశనం చేశాడన్నారు. విగ్రహాలను కూల్చినంత మాత్రాన సోమ నాథుడి ఉనికిని ఎవరూ అంతం చేయలేరని అభిప్రాయపడ్డారు.
ప్రధా ని మోదీ చేసిన ట్వీట్ భారతీయుల ఆత్మగౌరవాన్ని చాటుతోందని అభిప్రాయపడ్డారు. ఆలయాలను కూల్చి వేయవచ్చునేగాని, ప్రజల్లోని విశ్వాసా న్ని దెబ్బతీయలేరని మోదీ ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. వెయ్యేళ్లు గడిచినా సోమనాథ్ ఆలయం నేటికీ సగర్వంగా నిలబడే ఉందన్నారు. సనాతన ధర్మానికి ఉన్న శక్తిని ప్రధాని తన మాటల్లో ప్రతిబింబించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారతీయ సంస్కృతిపై దాడులు చేయాలనుకునే వారికి ఇదొక హెచ్చరిక అని పేర్కొన్నారు.
ఆలయాల విధ్వంసానికి పాల్పడినవారి గుర్తులు దేశంలో ఉండకూడదని ఆకాంక్షించారు. భారతదేశ చరిత్ర నుంచి ఆక్రమణదారుల పేర్లను తుడిచివేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. గజనీ వంటి విధ్వంసకారులు చేసిన పనులు ఎన్నటికీ ఆమోదయోగ్యం కావని, మన దేశంలో ఎక్కడైనా గజనీ పేరు కనిపిస్తే వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దౌర్జన్యానికి చిహ్నంగా ఉన్న పేర్లను భారత్ భరించాల్సిన అవసరం లేదని జ్యోతిర్మఠ్ శంకరాచార్య అభిప్రాయపడ్డారు.