9 May, 2026 | 2:55 AM

ఆదాయ వనరుల పెంపుతోనే స్థానిక సంస్థల బలోపేతం

09-05-2026 01:21 AM

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య

హనుమకొండ, మే 8 (విజయ క్రాంతి): స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించేందుకు స్థానిక సంస్థలు అంకితభావంతో  కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర రెండవ ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించిన సెంట్రల్ తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు ఎస్. సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ జిల్లాల అదనపు కలెక్టర్లు తమ తమ జిల్లాలలో స్థానిక సంస్థల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ వనరులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, తడిపొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు చేపడుతున్న చర్యలపై అధికారులు వివరించారు.

అలాగే గ్రాంట్లు, స్థానిక ఆదాయ వనరులు, ఇతర మార్గాల ద్వారా లభిస్తున్న రాబడిపై సమగ్ర నివేదికలను సమర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనే భావనతో స్థానిక సంస్థలు పనిచేయాలని సూచించారు.

అనవసర వ్యయాలను తగ్గించి, స్వీయ ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలను ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యం చేస్తూ వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఆదాయ వనరుల అభివృద్ధితో పాటు శాస్త్రీయ దృక్పథంతో ప్రణాళికలు అమలు చేస్తేనే పల్లె, పట్టణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.