22 August, 2026 | 4:01 AM

కాంగ్రెస్‌కు స్థానికం సవాలే

14-06-2024 12:23 AM
  • రిజర్వేషన్లు పెంచాకనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్లు
  • రిజర్వేషన్ల పెంపునకు కులగణన తప్పనిసరి 
  • పాలకవర్గం లేకపోవడంతో కేంద్ర నిధులు బంద్
  • గ్రామాల్లో పడకేసిన అభివృద్ధి పనులు   

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయా? జనాభా ప్రతిపాదిక మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు అనేది తలనొప్పిగా మారిందా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పరిమితిని సడలించి బీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచి ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. కానీ కేంద్రంలో అధికారం రాకపోవడంతో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్రానికి ఇబ్బందిగానే ఇచ్చిన హామీని ఎలా నెరవేర్చాలో మల్లగుల్లాలు పడుతోంది.

అసెంబ్లీ ఎన్నికల ముందు కులగణన చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో రిజర్వేషన్లు పెంచాకనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని సొంత పార్టీతో పాటు వివిధ ప్రజా సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ఈ ఏడాది జనవరి 31తో ముగిసింది. ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల సమక్షంలో పంచాయతీ పాలన కొనసాగుతోంది. వచ్చే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవీకాలం కూడా ముగుస్తుంది.

అయితే గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రావాలంటే పాలకవర్గం ఉండాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉండటంతో కేంద్రం నుంచి వచ్చే 14,15వ ఫైనాన్స్ నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. 

కేంద్ర నిధుల కోసం..

రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే మరో నాలుగైదు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. రిజర్వేషన్లు పెంచడం వల్ల బీసీలు ఎక్కువ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు అయ్యే అవకాశం దక్కుతుంది. ఒకవేళ రిజర్వేషన్లు పెంచకుండానే పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రతిపక్షాలు, వివిధ బీసీ సంఘాలతో పాటు సొంత పార్టీలోని బీసీ నాయకుల నుంచి  ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సర్కార్ మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 18 శాతం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 23 శాతమే అమలు చేసిందని బీసీ సంఘాలు చెబుతున్నాయి.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాలని ఆయా వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అవసరమైతే మరో నాలుగైదు నెలలు వాయిదా వేసి కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాక స్థానిక సమరానికి వెళ్లాలని కోరుతున్నారు. లేదంటే  ప్రభుత్వంపై పోరుబాట తప్పదని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మరో విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసాను తెచ్చుకోవడం ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం.