11-10-2025 01:24:32 AM
నాగర్ కర్నూల్, అక్టోబర్ 10 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ శివారులో శుక్రవారం ప్రభుత్వ భూమిని కొందరు భూకబ్జాదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగనూల్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 361లో కోట్ల విలువ చేసే సుమారు 6 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది.
గత బిఆర్‌ఎస్ హయాంలో కొంతమంది అప్పటి కౌన్సిలర్లు ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని స్థానికులు పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.దీంతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, 2021 ఫిబ్రవరిలో ఆ భూమి ప్రభుత్వాదీనమని ప్రకటిస్తూ బ్యానర్ ఏర్పాటు చేశారు.
అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా, ఆ పార్టీలోని కొందరు నేతలు అధికార పార్టీలో చేరి మళ్లీ అదే పనిలో నిమగ్నమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి అధికారులను మచ్చిగ చేసుకొని ఎక్కడైనా ప్రభుత్వ భూమి లేదా లిటిగేషన్ భూమి కనిపిస్తే, వెంటనే దానిపై పాగా వేయాలన్న ధోరణి పెరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికార పార్టీకి చెందిన కొందరు ప్రముఖ నాయకులే ఈ భూకబ్జా వ్యవహారాల వెనుక ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కోట్ల విలువచేసే ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులుకోరుతున్నారు.