ఆంధప్రదేశ్ జల, విద్యుత్తు దోపిడీ
- గతేడాదికంటే 2026 జూన్‌లో అత్యధికంగా జల విద్యుత్తు ఉత్పత్తి చేసిన ఏపీ
- పక్క రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కనపడని వైనం
- కృష్ణా జలాలను యధేచ్ఛగా తరలిస్తున్న ఏపీ
- ఎల్‌నీనోతో దేశ వ్యాప్తంగా తగ్గిన జలవిద్యుత్తు ఉత్పత్తి
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఊరందరిదీ ఒక దారి అయితే.. ఉలిపిరి కట్టెది మరోదారి అన్న చందంగా ఉంది పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ది. ఎల్‌నినో ప్రభావం కారణంగా.. వర్షపాతం తగ్గిపోయి.. నదుల్లో ప్రవాహాలు లేక.. రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటి.. జల విద్యుత్తు ప్రాజెక్టులు పనిచేయడం లేదు. కానీ ఏపీలో మాత్రం జల విద్యుత్తునే తీసుకుంటే.. 2026 జూన్‌లో 20225 జూన్‌కంటే ఎక్కువ జల విద్యుత్తు ఉత్పత్తి కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ప్రపంచమే ఎల్‌నినో ప్రభావంతో అల్లాడిపోతోంది. అన్ని దేశాల ప్రభుత్వాలు ఎల్ నినో ప్రభావం నుంచి సంరక్షించుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.. అనేక ప్రణాళికలు కూడా అమలు చేస్తున్నారు.
భారత దేశం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఎల్‌నినో ప్రభావంతో.. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు కనపడుతున్నాయి. దీనితో జల విద్యుత్తు ఉత్పత్తిపై కూడా స్పష్టంగా కనపడుతోంది. అయితే అన్ని రాష్ట్రాలది ఒక పరిస్థితి అయితే.. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మాత్రం ఎల్‌నినో ప్రభావం ఏమాత్రం కనపడటం లేదు. ఎందుకంటే.. దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ జల వనరులు తగ్గి.. జల విద్యుత్తు ఉత్పతి తగ్గూతూ వస్తుంటే.. ఏపీలో మాత్రం జల విద్యుత్తు ఉత్పత్తి పెరగడం గమనార్హం.
ఎల్‌నినోతో చాలా స్వల్పంగా జల విద్యుత్తు
దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. వర్షాకాలం ప్రారంభ మాసం అయిన జూన్ (2026)లో రాష్ట్రాల వారీగా జరిగిన జల విద్యుత్తు ఉత్పత్తిని పరిశీలిస్తే ఎల్‌నినో ప్రభావం ఎంతగా ప్రభావం చూపుతుందో అర్థమ వుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెబ్‌సైట్‌లో ఉన్న గణాంకాలు ఈ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2025 జూన్‌లో మొత్తం 16775.50 మిలియన్ యూనిట్ల జల విద్యు త్తు ఉత్పత్తి జరగ్గా.. 2026 జూన్‌లో అదికాస్తా 13362.39 మిలియన్ యూనిట్లకు తగ్గిపోయింది.
ఇదే పరిస్థితి దక్షిణాది రాష్ట్రాల్లోనూ కనపడుతోంది. జల విద్యుత్తు ఉత్పత్తి అత్యధికంగా ఉండే కేరళం, కర్నాటకను పరిశీలిస్తే.. 2025 జూన్‌లో 1100 లకుపైగా మిలియన్ యూనిట్లను ఉత్పత్తిచేశాయి. ఆయా రాష్ట్రాల్లోని జల విద్యుత్తు కేంద్రాలు నదులు, రిజర్వాయర్లలో నీటిమట్టం లేకపోవడంతో కర్నాటక 568, కేరళం 320 మిలియన్ యూనిట్లకే పరిమితమ య్యాయి. అలాగే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈ జల విద్యుత్తు ఉత్పత్తి 25 శాతానికి పడిపోవడం గమనార్హం. 2025 జూన్‌లో 310.96 మిలియన్ యూనిట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగా.. 2026 జూన్‌లో అదికాస్తా 64.36 మి.యూ లకు పడిపోయింది.
కృష్ణా జలాలను తోడేస్తున్న ఏపీ
ఏపీ, తెలంగాణలోని ప్రధానమైన జల విద్యుత్తు కేంద్రాలు కృష్ణా నదిపైనే ఉన్నాయి. ఏపీ పరిధిలో మొత్తం 1610 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న జల విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. ఇందులో లోయర్ సీలేరు (460 మెగావాట్లు) ఒక్కటే కృష్ణానది పరీవాహక ప్రాంతంతో లేనిది. ఇక తెలంగాణ పరిధిలో 2405.60 మెగావాట్ల సామర్థ్యమున్న జల విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకున్నా.. ఏపీ కన్నా ఎక్కువ జల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న తెలంగాణ ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. కానీ ఇక్కడ ఏపీ సుమారు 800 మెగావాట్ల సామర్థ్యం తక్కువ ఉన్నప్పటికీ.. తెలంగాణ కంటే ఎక్కువ జల విద్యుత్తును ఉత్పత్తి చేయడం గమనార్హం.
ఇదెలా జరిగిందంటే.. అటు శ్రీశైలం, ఇటు నాగార్జున సాగర్‌లో కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తూ.. అటు నీటిని.. దీనితోపాటు జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసి వాడుకుంటుందని స్పష్టమవుతోంది. ఉదాహరణకు.. సీఈఏ (సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ) గణాంకాల ప్రకారమే చూసుకుంటే.. 2026 ఆగస్టు 8 నాడు ఏపీ పరిధిలోని శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుంచి 9.68 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కానీ ఆ రోజు చేసిన జల విద్యుత్తు ఉత్పత్తి మాత్రం 14.64 మిలియన్ల యూనిట్లు. అలాగే 9.8.206 తేదీనాడు 9.68 మి.యూనిట్లకుగాను.. 11.02 మి.యూనిట్ల జల విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. అంటే.. నిర్దేశించిన లక్ష్యం కంటే..ఎక్కవ జల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఎక్కువ జలాలను వాడుకున్నట్టుగా అర్థమవుతోంది. ఇదే పద్ధతి జూన్ నెలలోనూ చేపట్టి.. గతేడాదికంటే ఎక్కువ జల విద్యుత్తును ఉత్పత్తి చేసిందని తెలంగాణవాదులు గట్టిగా చెబుతున్నారు. అదే సమయంలో ఇలా జల విద్యుత్తుకు ఉపయోగించిన కృష్ణా జలాలను కూడా ఏపీ మళ్లించుకుందని ఆరోపిస్తున్నారు. అంటే దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనపడుతుండగా.. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి ఎలా ఉంటుందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నిస్తేజంగా.. తెలంగాణ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వంలోని ప్రాధికార సంస్థ అయిన సీఈఏ చెప్పిన గణాంకాలే ఇలా ఉంటే.. వాస్తవాలు మరింత కఠినంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణవాదులు అంటున్నారు. అంటే.. ఆ గణాంకాల కంటే ఎక్కువ మొత్తంలోనే కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇంత పకడ్బందీగా అటు కృష్ణా జలాల తరలింపు.. ఇటు జల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటంపై సర్వత్రా ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ప్రబుత్వం.. ఏపీ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తుందనే అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ఇక్కడి ప్రభుత్వం.. ఎల్‌నినో ప్రభావాన్ని పక్కనపెట్టి.. జల విద్యుత్తు ఉత్పత్తిని ఎక్కువచేసి.. తద్వారా కృష్ణా జలాలను తరలిస్తున్నా.. పట్టనట్టుగా వ్యవహరించడాన్ని ఎత్తిచూపుతున్నారు. ఎల్‌నినో ప్రభావం మరింత పెరగనున్న నేపథ్యంలో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వం చర్యలను అడ్డుకోవాలని కోరుతున్నారు. 
అందరికంటే భిన్నంగా.. ఏపీ..
అయితే దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో జమ్మూకశ్మీర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్‌ను మినహాయిస్తే.. జల విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏమీ మినహాయింపు కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఎల్‌నినో పనిచేయలేదని రాజకీయ విశ్లేషకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2025 జూన్‌లో ఏపీలోని జల విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా 310.96 మి.యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవ్వగా.. 2026 జూన్‌లో మాత్రం 464.69 మి.యూనిట్లు ఉత్పత్తి అయ్యింది. అంటే 2025 జూన్‌తో పోల్చుకుంటే.. 50 శాతం జల విద్యుత్తు ఉత్పత్తి పెరగడం గమనార్హం.






