16 August, 2026 | 1:44 AM

వెలమ నాయకులే పద్మ నాయకులు

16-08-2026 12:31 AM

క్రీ.శ.1323లో కాకతీయ రాజ్య పాలకుడు ప్రతాప రుద్రుడు ఢిల్లీ సుల్తాన్ ఘియాసుద్దీన్ తుగ్లక్ కొడుకు ఉలుగ్ ఖాన్ సైన్యం దాడిలో పరాజయం పాలైనాడు. కాకతీయ యుగం ముగిసిపోయింది. ఉలుగ్ ఖాన్ కాకతీయులేలిన తెలంగాణాను, ఇతరులు పాలించే పరిసర రాజ్యాలను గెలిచాడు.

క్రీ.శ.1325లో తండ్రి మరణవార్త తెలిసిన ఉలూగ్ ఖాన్ ఢిల్లీకి తిరిగి వెళ్లాడు. ఢిల్లీ సుల్తానైన పిదప మహమ్మద్ బిన్ తుగ్లక్‌గా ప్రసిద్ధుడైనాడు. తెలంగాణాలో పూర్వ కాకతీయ రాజ్యంలో తుగ్లక్ నియమించిన సర్దార్ల పాలనలో అరాచకాలతో అసహనం పాలైన ప్రజలు తిరుగుబాట్లు చేయసాగారు. ప్రజాభిప్రాయంతో మమేకమైన కొందరు పూర్వ కాకతీయ సామంతులు తిరుగుబాట్లకు నాయకత్వం వహించారు. తిరుగుబాటు నాయకులలో ముసునూరి నాయకులు, కొండవీటి రెడ్లు, హరిహర, బుక్క సోదరులు, రేచెర్ల వెలమలు ప్రసిద్ధులు. 

కాకతీయుల కాలంలో గణపతిదేవుని పాలనలో ఒకశతాబ్దికి పైగా అత్యంత ప్రాముఖ్యానికి వచ్చిన వంశం పేరు రేచర్ల పద్మనాయకులది. ఈ పద్మనాయకుల పూర్వనివాసం సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి పట్టణానికి దగ్గరగావున్న ఆమనగంటిపురం.రేచర్ల పద్మనాయకులు కాకతీయ గణపతిదేవునికి, రుద్రమదేవికి, ప్రతాపరుద్రునికి సేనాపతులుగా వున్నారు. వీరిలో ‘కాకతి రాజ్యస్థాపనాచార్య, రాయపితామహంక’ బిరుదులుగొన్న వారున్నారు. కాకతి రాజ్యమంతరించిన పిదప దేశం అన్యాక్రాంతమైనపుడు తిరిగి స్వాతంత్య్ర శంఖమూది, పోరాటానికి నడుము కట్టారు. (తేరాల సత్యనారాయణశర్మ -రాచకొండ చరిత్రము, పే.1)

రేచెర్లవారు కాకతీయులకు సామంతులుగా ఉన్నవారే. గణపతి దేవుని కాలం నుంచి విశ్వాసపాత్రులై కాకతీయ రాజ్యానికి సేవచేసిన రేచర్ల ‘పద్మ వెలమలు’ సేనానులుగా ఉన్నతాధికారాలు, పదవులు పొందారు. రేచెర్ల వంశ స్థాపకుడని బేతాళనాయకుని పేరు చెప్పుకుంటారు. రైతు కుటుంబాలలో ప్రఖ్యాతమైన వెలమ కులానికి చెందిన ఇతనికి పెద్దనిధి దొరకడంతో సామజిక అంతస్తు మారింది. ఆమనగల్లులో ప్రముఖుడైనాడు. గణపతి దేవుడు ఆమనగల్లు ప్రాంత పాలనను బేతాళ నాయకునికి అప్పగించాడు.

(నేలటూరి వేంకటరమణయ్య,1939-వెలుగోటివారి వంశావళి) బేతాళ నాయకుడు మొదలు రేచెర్ల వెలమల కుటుంబం తర, తరాలుగా కాకతీయులకు విశ్వాసపాత్రంగా వుంది. కాకతీయుల రాజ్యకార్య నిర్వహణలో క్రియాశీలంగా పనిచేసిన రేచెర్ల రెడ్లు, మల్యాల నాయకులు ఎందువల్లనో మరుగుపడిపోయారు. ఆ ఖాళీని బేతాళనాయకుని పూరించారని, రేచెర్ల వెలమలు పోషించిన విశ్వసనీయమైన పాత్ర గురించి వివరిస్తూ, బేతాళనాయకుడు విశ్వాసమనే ఖడ్గాన్ని తన కొడుకులకు అందించాడని, గణపతిదేవుడు రుద్రమదేవిని తన రాజ్యవారసురాలిగా ప్రకటించినపుడు తిరుగుబాటు చేసిన వారిని అణిచివేసి,

అదుపుచేయడానికి కాయస్థ జన్నిగదేవుడు, త్రిపురారులు, రేచెర్ల వెలమ నాయకుడు ప్రసాదిత్యుడు విశ్వసనీయంగా పనిచేసారని పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’లో రాసారు. ప్రసాదాదిత్యుడు రాణి రుద్రమదేవి పక్షం వహించి, ఆమెను అధికారం నుంచి తొలగించాలని కుట్రలు పన్నినవారిని అణిచివేసాడు. రేచెర్ల నాయకులలో రుద్రుడు, ప్రసాదిత్యుడు రుద్రమదేవి ఆస్థానంలో ఉండగా, మూడవవాడు దామయ ఆమనగల్లు వ్యవహారాలను చక్కదిద్దాడు.

గణపతి దేవుని కాలంలో 77మంది నాయకుల బృందంతో ఏర్పాటైన కాకతీయ రాజ్య పరిరక్షణ ‘నాయంకర’ వ్యవస్థలో ప్రసాదాదిత్యుడు ఒక నాయకుడిగా నియమించబడ్డాడు. కాని, ఈ వ్యవస్థను రూపొందించింది తర్వాత కాలంలో ప్రతాపరుద్రుడని ‘ప్రతాపచరిత్ర’లో పేర్కొనబడ్డది. క్రీ.శ.1279నాటికే నాయంకర వ్యవస్థ నెలకొని వుందని శాసనాలు చెప్తున్నాయి. (South Indian Inscriptions, Vol.IV:No.704) రుద్రమదేవి కాలంలో నాయక బిరుదు పొందినవాడు ప్రసాదిత్యుడే. రేచెర్ల రుద్రుడు, ప్రసాదాదిత్యుల వారసుల గురించి తెలియరాలేదు.

(టి.దయాకర్ రావు- హిస్టరీ ఆఫ్ పద్మనాయకాస్-2016). వెలమలనే పద్మనాయకులనడం వ్యవహారం. విష్ణు పాదపద్మాల నుంచి జన్మించినందుకు వీరికీపేరు వచ్చిందని కొందరి అభిప్రాయం. కాని, పురుషసూక్తం ప్రకారం శూద్రులందరు విష్ణుపాద పద్మోద్భవులేకదా. (బీఎస్సెల్ హనుమంతరావు-ఆంధ్రుల చరిత్ర, పే.282) పద్మనాయకులలో ఉన్న 77గోత్రాలలో రాచకొండ, దేవరకొండలను పాలించిన పాలకులది రేచెర్ల గోత్రం. బ్రహ్మనాయని గోత్రం రేచెర్ల గోత్రమే.

పల్నాటి యుద్ధానంతరం వెలమలు ఆమనగల్లు, పిల్లలమర్రి, వరంగల్లు ప్రాంతాలకు వలసపోయి, కాకతీయుల ప్రాపకం సంపాదించి బలపడినారని చెప్పవచ్చు. వెలుగోటి వంశావళిలో చెవిరెడ్డి అనే మారుపేరుగల బేతాళనాయకుడు వెలమల మూలపురుషుడని చెప్పబడ్డది. వెలమలలో రెడ్డిపేరు కలవారు లేరు. పిల్లలమర్రి పాలకులలో రెడ్డి సామంతుడు చెవిరెడ్డి ప్రసిద్ధుడు. వెలుగోటి వంశావళి రచయిత బేతాళనాయకుడే చెవిరెడ్డి అని పొరపాటున రాసివుండ వచ్చుననే అభిప్రాయం బీఎస్సెల్ హనుమంతరావుది. బేతాళనాయకుడే బ్రహ్మనాయుడనే అభిప్రాయం కూడా వుంది.

రేచర్ల వెలమలు, పద్మనాయక కులస్తులు

వెలమనాయకులనే రేచర్ల వెలమలని, పద్మనాయక కులస్తులని చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ వంశపు మూలపురుషుడైన రేచడి పేరుమీదుగా వీరు రేచర్ల వారయ్యారని అభిప్రాయపడ్డారు పివి పరబ్రహ్మశాస్త్రి. (కాకతీయులు, పే.160) వీరినే పద్మనాయకులుగా పేర్కొంటు వీరి వంశానికి మూలం రేచెర్లరెడ్లు అని చెప్తారు సుంకిరెడ్డి నారాయణరెడ్డి.(తెలంగాణ చరిత్ర-పే.145).

రాచకొండ పాలకుల గురించి రాచకొండ చరిత్ర రాసిన తేరాల సత్యనారాయణ ‘రేచర్ల నామమే పూర్వం బ్రహ్మసేనాని మొదలు కాట్రెడ్డి వరకు గల పిల్లలమర్రిరెడ్డి సేనాపతులకు వంశనామంగా వాడబడినది. ఆ పేరుతోనే వృద్ధిలోనికి వచ్చిన పద్మనాయకులకు రేచర్ల నామం రెండువంశాలకు ఒకటే వుండడం, ఒకటే గ్రామం కావడంవల్ల రెండు వంశాలు ఒకటే అనే భ్రమకు చరిత్రకారులు లోను కావలసివచ్చినది. శాసనాలను, ఇతర ఆధారాలను పరిశీలించినపుడు ఈ రెండు వంశాలు వేరని తేలుతున్నది.

రెడ్డి సేనాపతులు రేచర్లను వంశనామంగాను, పద్మనాయకులు గోత్ర నామంగాను వాడుకున్నట్లు తేటతెల్లమవుతున్నది. ఇది పూర్వానుగతమే కాని ఆకస్మికం కాదు.’ అని వివరించారు. కోటగిరి వెంకట నరసింహ సత్యనారాయణరావు ‘పద్మనాయకులు, వెలమలు పర్యాయపదాలు. 77 గోత్రాల పద్మనాయకులు, వెలమదొరలు, వెలమూరు, రాచవెలమలు, పద్మనాయకులు పర్యాయపదములే’ అని తెలిపారు. పద్మనాయకులు, వెలమలు ఒక్కరేనని తీర్మానించారు చెన్నమనేని పద్మ(తెలంగాణ పద్మనాయకులు,పే.67). శాసనాలలో పద్మనాయక చరిత్ర దాచానాయనితో ప్రారంభమౌతున్నది. గణపతిదేవుని కాలంలో దామ, రుద్ర, ప్రసాదిత్యనాయకులు ప్రసిద్ధులు.

రుద్రమదేవి హయాంలో జరిగిన తిరుగుబాటులను అణిచివేసినవాడిగా ప్రసాదిత్యనాయకుడు పేరుగాంచాడు. ఇతనికి ‘కాకతీయరాజ్య స్థాపనాచార్య’, ‘రాయపితామహాంక’ బిరుదు లున్నాయి.(వెలుగోటివారి వంశావళి) ప్రసాదాదిత్యుని సోదరకుమారుడు వెన్నయ తెలంగాణాపై దండెత్తిన ముస్లిం సైన్యాలనెదుర్కొని గెలిచాడని చరిత్రకారులు రాసారు. ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఎరదాచానాయుడు, అతని కొడుకు సింగమనాయుడు సేనాపతులు. దాచానాయుడు ‘పంచపాండ్య విభాళ’ బిరుదుతో ప్రసిద్ధుడు. సింగమనాయుడు కాంచీ, కంపిలి రాజ్యాలమీద దాడిలో చూపిన వీరత్వానికి ప్రతాపరుద్రుని నుంచి ఆశీతి (84)వరాలను పొందాడట.

స్వతంత్ర పాలకులు

కాకతీయసామంతులైన వెలమనాయకులు కాకతీయులనంతరం స్వతంత్రపాలకులుగా ఎదిగారు. గణపతిదేవుని కాలం నుంచి కాకతీయుల కొలువులో పాలనా వ్యవహారాలలో పెద్దపదవులు పొందిన వీరు, తుగ్లక్ చేతిలో కాకతీయరాజ్యం పతనమైనంక స్వతంత్రించారు. వెలమ నాయకులను ప్రస్తావించే శాసనాలు, వారు కట్టించిన దుర్గాలు, దేవాలయాలు, తవ్వించిన చెరువులు, వారి కాలంనాటి సాహిత్యం వంటివి మనకు చారిత్రక ఆధారాలుగా లభిస్తున్నాయి.

శాసనాలు: వీరి శాసనాలు మహబూబునగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఎక్కువగా లభించాయి.

1. రాచకొండ శాసనము(రేచెర్ల అనపోతానీడు-1361), 2. రాచకొండ శాసనము(రేచెర్ల అనపోతానాయుడు-1365), 3. రాచకొండ శాసనము(రేచెర్ల అనపోతానాయుడు-1365), 4. ఐనవోలు శాసనము(రేచెర్ల అనపోతానాయుడు-1369), 5. రాచకొండ శాసనము( రేచెర్ల సింగమ మాధవనాయకుడు-), 6. పానగల్లు శాసనము( రేచెర్ల సింగమ మాధవనాయు డు-), 7. కందికొండ శాసనము( రేచెర్ల చెన్న భూపతి-1375), 8. కందికొండ శాసనము(రేచెర్ల చెన్న ప్రభువు-), 9.ఉమామ హేశ్వర శాసనము (రేచెర్ల సింగమ మాధవనాయకుడు-1376), 10.

జాతరరేవు శాసనము(రేచెర్ల సింగయ మాధవనాయడు-), 11. భువనగిరి శాసనము(రేచెర్ల అనపోతానాయడు-1378), 12. సింహాచల శాసనము(రేచెర్ల దాచినాయని అనపోతానాయని దేవేరి-1380), 13. రాచకొండ శాసన ము(రేచెర్ల 1వ అనపోతానాయడు-1380), 14. శ్రీకూర్మ శాసనము(రేచెర్ల సింగమనాయని పినమాదానాయడు-1405), 15. దేవలమ్మ నాగారం శాసనము(రేచెర్ల రావు మాధవరాయని రాణి నాగాంబిక-1427), 16. సాయంపేట శాసనము(రేచెర్ల రావు ధర్మానాయడు-1446), 17.శనిగరం శాసనము(రేచెర్ల వెన్నమ, అనపోతా నాయలు-), 18. దోమలపల్లి, 19. గన్నెర్ల, 20. దేవరకొండ, 21. దేవరకొండ, 22. గార్ల, 23. బెల్లంకొండ, 24. వరంగల్, 25. తిరుపతి, 26. తిరుపతి, 27. తిరుపతి, 28. శ్రీకాకుళం, 29. త్రిపురాంతకం, 30. పానుగల్లు.

సమకాలిక రాజవంశాలైన గజపతులు, రెడ్డిరాజులు, విజయనగరరాజులు, బహమనీల శాసనాలు మరొక ఆధారం. దక్షిణ భారత శాసన సంపుటులు 5, 6, 10లలో, ఎపిగ్రాఫియా ఆంధ్రికా సంపుటులు 1,4లలో హైద్రాబాద్ ఆర్కియలాజికల్ సిరీస్ 3, 13, 19లు,  వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబునగర్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల శాసన సంపుటులలో రేచెర్ల వెలమల శాసనాలు లభిస్తున్నాయి.

నాణాలు: వెలమనాయకుల నాణాలేమీ లభించలేదు.

సాహిత్యాధారాలు: సాహిత్యంలో కాశీఖండం, హరవిలాసం, పల్నాటిచరిత్ర, మహాభాగవతం, సంగీతరత్నాకరం, రసార్ణవ సుధాకరం, రత్నపాంచాలిక, మదనవిలాస భాణం, భోగినీదండకం, హరిశ్చంద్రోపాఖ్యానం, సింహాసన ద్వాత్రింశిక, ప్రతాపచరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర, క్రీడాభిరామం, వెలుగోటివారి వంశావళి, సురభి వంశచరిత్ర, చమత్కార చంద్రిక, అమరకోశ వ్యాఖ్యానం,  చాటువులు, దండకవిలెలు, ఫెరిస్టా వంటి విదేశీయుల రచనలు లభిస్తున్నవి. వెలమనాయకుల చరిత్రకు ప్రధానమైన ఆధారంగా పేర్కొంటున్న ‘వెలుగోటివారి వంశావళి’లో వెంకటగిరి సంస్థానాధీశుల చరిత్రతోపాటు పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు, మైలవరం వంటి వెలమల సంస్థానాలను గురించి వివరణలున్నాయి.

వెలుగోటి వంశావళిని ఉద్ధండపండితులైన ఇద్దరు వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రులు ఉమ్మడిగా రచించారు. వారీ గ్రంథరచన కోసం మద్రాసులోని మెకంజీ మ్యాన్యుస్క్రిప్టు లైబ్రరీలోని పద్మనాయకుల గోత్రవివరాలను, గోత్ర ప్రశస్తుల్ని, బిరుదావళుల్ని, శాసనాల్ని, వివిధ గ్రంథాల్ని పరిశోధించారు. పరిశోధితమైన అంశాలను వెలుగోటి వంశావళిలో చేర్చి రచించారు. ఈ చరిత్ర గ్రంథరచనకు మెకంజీ కృషి మూలమని చెప్పాలి. ఓరుగల్లు, హనుమకొండ, కొండవీడు, ప్రతాపరుద్రదేవ కైఫీయతులు మెకంజీ మాన్యుస్క్రిప్టులే.

నిర్మాణాలు: రాచకొండ, దేవరకొండ, భువనగిరి, కోటలు, రాచకొండలో రామస్వామి దేవాలయం, భైరవాలయం, లక్ష్మీదేవి గుడి, దేవరకొండలో శివాలయం, రామాలయం, భువనగిరిలో సోమేశ్వరాలయం వంటి గుడులు, చెరువులు, బావులు రేచెర్ల వెలమల నిర్మాణాలకు సాక్షులుగా నిలిచివున్నాయి. 

వెలమనాయకుల వంశ-చరిత్ర:

సాహిత్యగ్రంథమైన ‘వెలుగోటి వంశావళి’ని వెలమనాయకుల చరిత్రకు ఆధారంగా పేర్కొంటున్నారు. ఇది రేచర్ల గోత్రీకులైన వెలుగోటి వంశానికి చెందిన వెంకటగిరి సంస్థానాధీశుల వంశచరిత్ర. ఈ గ్రంథం రాతప్రతులను పరిశోధించి, పరిష్కరించి, వెలుగోటిరాజుల వంశవృక్షాన్ని జోడించి, పీఠిక రాసింది చరిత్రకారుడు నేలటూరి వెంకటరమణయ్య. మద్రాసు యూనివర్సిటీ దీనిని 1939లో ప్రచురించింది. అయితే ఈ గ్రంథంలోని ఉదంతాలన్నీ వాస్తమమని చెప్పలేమని, అవి సంస్థానాధీశుల సంతృప్తికోసం రాయబడ్డాయని, చెవ్విరెడ్డిని దైవత్వంగల బేతాళరెడ్డిగా, వారి రేచర్ల గోత్రానికి మూలకారణంగా జీతగాడైన రేచడిని సృష్టించడం జరిగిందని నేలటూరు వెంకటరమణయ్య అభిప్రాయపడ్డాడు. 

వెలమనాయకుల రాజ్యం

పాత నల్గొండ, మహబూబునగర్ జిల్లాల్లో వెలమ నాయకులు తమ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. కాపయ నాయకుని అనంతరం వెలమ పాలకులు మొత్తం తెలంగాణాకు పరిపాలకులైనారు. రేచెర్ల వెలమ నాయకుల స్వతంత్రరాజ్య పాలన దాదాపు 150సం.ల పాటు క్రీ.శ.1361లో మొదలై క్రీ.శ.1475వరకు కొనసాగింది. కాకతీయుల అనంతరం రాచకొండ, దేవరకొండలను రాజధానులుగా చేసుకొని వెలమనాయకులు పాలించారు. పద్మనాయకులు కాపయనాయకునికి తెలింగానా రాజ్యంలో అతని లెంకలై ఉండిరి.

ప్రోలయవేముడు స్వతంత్ర రెడ్డిరాజ్యాన్ని స్థాపించడం కూడా వారి తిరుగుబాటుకు ప్రోద్బల కారణమైనది. అనపోత మాదానాయల తండ్రి సింగమనాయడు కాపయనాయకుని ఓడించినట్లు వెలుగోటివారి వంశావళిలో ఒక పద్యంలో ఉన్నది. అనపోతారెడ్డి జీవితమంతా ఈ పద్మనాయకులతో పోరాటాలలో గతించింది. రేచెర్ల పద్మనాయకుల నాయంకరాలు తెలింగానాలోని కౌలాస్ కోట, ఇందూరు, మెదక్ ప్రాంతాలలో ఉన్నాయి. కాపయనాయకుని మీద వీరు తిరుగబడ్డారు.

వారిలో మొదటివాడు ఎఱ్ఱదాచానాయడు కొడుకు సింగభూపతి. సింగభూపతి యుద్ధంలో కాపయను గెల్చినాడని వెలుగోటివారి వంశావళిలో రాసిన ప్రకారం ఇది 1361 అవుతుంది. దీనికే ఆధారాలు లేవు. పద్మనాయకులు కాపయను లెక్కచేయలేదని తెలుస్తున్నది.(రెడ్డి సంచిక,పే.43)