లక్నో x ముంబై

30-04-2024 01:05:51 AM

ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. 

లక్నో:  ఐపీఎల్ 17వ సీజన్‌లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో సొంతగడ్డపై 197 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోడంలో విఫలమైన లక్నో ముంబైతో మ్యాచ్‌లో దానిని రిపీట్ చేయొద్దని భావిస్తోంది. సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన లక్నో 5 విజయాలతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ముంబైతో మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్నోకు ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగయ్యే చాన్స్ ఉంది. మరోవైపు ముంబై ఆడిన 9 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 9వ స్థానంలో ఉంది. రాహుల్, దీపక్ హుడాలు మంచి ఫామ్‌లో ఉండగా.. విదేశీ ఆటగాళ్లు డికాక్, పూరన్, స్టోయినిస్‌లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.

మోసిన్ ఖాన్, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్‌లతో కూడిన బౌలింగ్ విభాగం పర్వాలేదనిపిస్తోంది. సంచలన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్శించిన యువ పేసర్ మయాంక్ యాదవ్.. గాయం నుంచి కోలుకొని ముంబైతో పోరులో బరిలోకి దిగనున్నట్లు లక్నో బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపాడు. ముంబై ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. అయితే జట్టు బ్యాటింగ్‌లో తిలక్ వర్మ ఒక్కడే స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.  రోహిత్ శర్మ, సూర్యకుమార్, ఇషాన్ కిషన్ రాణించాల్సిన అవసరముంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. బౌలింగ్‌లో మాత్రం ముంబై పర్వాలేదనిపిస్తోంది. పేస్ విభాగంలో బుమ్రా, కోట్జీ రాణిస్తుండగా.. స్పిన్నర్ చావ్లా ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు.

రాహుల్‌కు కీలకం

టీ20 ప్రపంచకప్‌కు డెడ్‌లైన్ దగ్గరపడుతుండడంతో బీసీసీఐ నేడు జట్టును ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయం కంటే కేఎల్ రాహుల్ ప్రదర్శనపై అందరి కళ్లు నిలువనున్నాయి. ఇప్పటికే రిషబ్ పంత్ కీపర్‌గా, బ్యాటర్‌గా అదరగొడుతూ ప్రపంచకప్‌కు సంబంధించి జట్టు ఎంపికలో ఫ్రంట్‌లైన్‌లో ఉన్నాడు. పంత్‌కు బ్యాకప్‌గా రెండో వికెట్ కీపర్‌గా రాహుల్‌కు ఎక్కువ చాన్స్ ఉన్నప్పటికి సంజూ శాంసన్ నుంచి తీవ్ర పోటీ ఉంది. దీంతో ముంబై తో మ్యాచ్ రాహుల్‌కు కీలకంగా మారింది. ఈ సీజన్‌లో రాహుల్ 144.27 స్ట్రుక్‌రేట్‌తో 378 పరుగులు సాధించాడు.