calender_icon.png 28 October, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సజావుగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా..!

27-10-2025 10:46:12 PM

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): జిల్లాలోని 67 మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ పద్ధతిలో సజావుగా పూర్తయింది. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎక్సైజ్ శాఖ అధికారి గాయత్రి సమక్షంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,518 దరఖాస్తులు అందగా, ఒక్కో షాపు వారీగా టోకెన్లను ప్రదర్శిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు.

కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఫోటో, వీడియో చిత్రీకరణ జరిపి ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చూసారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరైన నేపథ్యంలో టోకెన్ కలిగిన వారినే లోపలికి అనుమతించారు. కలెక్టరేట్ ఆవరణలో పోలీసు బందోబస్తు, అంబులెన్స్, వైద్యశిబిరం వంటి ఏర్పాట్లు చేశారు. అదృష్టం వరించిన వారికి లైసెన్స్ ఫీజు చెల్లింపుల కోసం వేదిక వద్దే సదుపాయాలు కల్పించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు, సిబ్బంది సమన్వయంతో లక్కీ డ్రా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.