27-10-2025 10:54:12 PM
రైలులో వదిలిపెట్టిన కనికరం లేని వ్యక్తులు..
పసిపాపను రక్షించిన అధికారులు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అభం శుభం తెలియని పసిపాపను కనికరం లేని వ్యక్తులు ట్రైన్లో వదిలిపెట్టిన సంఘటన అందరి మనసును కలిచివేసింది. సికింద్రాబాద్ నుంచి పాట్నాకు వెళ్తున్న దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో గుర్తు తెలియని తల్లి సుమారు రెండు నెలల పసిపాపను వదిలి వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. పాపను గమనించి వెంటనే కాగజ్నగర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
రైల్వే స్టేషన్లో పాపను తమ ఆధీనంలోకి తీసుకున్న రైల్వే పోలీసులు.. జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్ బూర్లాకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న జిల్లా బాలల సంరక్షణ విభాగం, సిబ్బంది పాపను స్వాధీనం చేసుకొని బాల రక్షా భవన్ కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ పాపను అదిలాబాద్ లోని గృహానికి తరలించడం జరుతుందని చెప్పారు. పాపను చట్టబద్ధంగా శిశు గృహం ద్వారా అవసరమైన వారికి దత్తత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల రక్షా భవన్ సిబ్బంది శ్రావణ్ కుమార్, జమున, చంద్రశేఖర్, బాల ప్రవీణ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.