28-11-2025 07:31:09 PM
గెలుపోటములను సమానముగా స్వీకరించాలి
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రొఫెసర్ జయ శంకర్ స్టేడియం, రుద్రంపూర్ నందు 3 రోజులపాటు నిర్వహించే కోల్ ఇండియా స్థాయి పురుషుల కబడ్డీ పోటలు (లీగ్ కమ్ నాకౌట్) ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం.షాలేం రాజు అధ్యక్షతన జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిధిగా సింగరేణి డైరక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎల్.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు.
విశిష్ట అతిధులుగా డైరక్టర్( పి&పి) శ్రీ వెంకటేశ్వర్లు, డైరక్టర్(ఈ&ఎం) ఎం.తిరుమల రావు, ఏఐటియూసి జనరల్ సెక్రటరీ కే.రాజ్ కుమార్, ఐఎన్‌టియూసి జనరల్ సెక్రటరీ సి.త్యాగరాజన్, కొత్తగూడెం ఏరియా సిఎంఓఏఐ ప్రెసిడెంట్ ఎం.వి.నరసింహా రావు, జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ శ్రీ జి.వి.కిరణ్ కుమార్ హాజరయ్యారు. ముందుగా పాఠశాల స్కోట్స్ విద్యార్థులు, అతిధులని వేదిక వద్దకు ఆహ్వానించారు. అనంతరం,జ్యోతి ప్రజ్వలనతో ముఖ్య అతిథి,సింగరేణి డైరక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎల్.వి.సూర్యనారాయణ ఒలంపిక్ పతాక ఆవిష్కరణ చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు.
అనంతరం అతిధులు ప్రారంభ ఉపన్యాసం లో మాట్లాడుతూ... 2025-26 ఆర్ధిక సంవత్సరానికి కోల్ ఇండియా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను (లీగ్ కమ్ నాకౌట్) సింగరేణి కొత్తగూడెం ఏరియా నిర్వహించుకోవటం చాలా సంతోషం అని, క్రీడా ప్రతిభతో స్నేహభావంతో క్రీడలలో రాణించాలని, క్రీడలు అనేవి శారీరక దృడత్వానికి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ క్రీడా పోటీలలో గెలుపు ఓటములను సమానముగా తీసుకోవాలని తెలుపుతూ, ఈ పోటీలలో పాల్గొనే కోల్ ఇండియా పరిధిలోని 8 బొగ్గు సంస్థల జట్లు అయిన సింగరేణి, బిసిసిఎల్, సిసిఎల్, ఈసిఎల్, ఎన్‌సిఎల్, ఎస్‌ఈసిఎల్, ఎంసిఎల్, డబల్యూసిఎల్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కబడ్డీ పోటీలలో క్రీడాకారులు ఎటువంటి గాయాలు తగలకుండా జాగ్రతలు తీసుకుంటూ, స్నేహభావం తో ఈ 3 రోజుల కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని కోరారు.