28-11-2025 08:02:59 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిఅనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో శుక్రవారం కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించకపోతే కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని అన్న కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదని అన్నారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత హుందాగా ప్రవర్తించాలని, రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే భౌతిక దాడులకు సైతం వెనుకాడ పొమ్మన్నారు. ప్రోటోకాల్ గురించి నీతులు చెప్పే కౌశిక్ రెడ్డి ప్రోటోకాల్ లో ఉన్న ఒక ముఖ్యమంత్రి పై ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. కౌశిక్ రెడ్డికి ముఖ్యమంత్రి అంటే భయమని అందుకే పైకి గంభీరంగా మాట్లాడుతూ లోపట భయపడే వ్యక్తి కౌశిక్ రెడ్డి అని అన్నారు. ఏ ఎమ్మెల్యే తన కార్యాలయాన్ని పార్టీ ఆఫీసుగా మార్చుకొని ప్రోటోకాల్ తప్పుతున్నారన్నారు. వెంటనే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.