calender_icon.png 10 September, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22న రవీంద్రభారతిలో మాదిగల కృతజ్ఞత సభ

10-09-2025 01:27:39 AM

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ

ముషీరాబాద్, సెప్టెంబర్ 9(విజయక్రాంతి): మాదిగల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనెల 22న మధ్యాహ్నం  రవీంద్రభారతిలో ’మాదిగల కృతజ్ఞత సభ’ నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య తెలిపారు.  రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభకు మాదిగలందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్  అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎస్సీ వర్గీకరణ అమలుకు తమ చిత్తశుద్ధిని చాటుకున్న సీఎం ఎ.రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించిన రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సభకు ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బుగ్గ మైసయ్య, ఈరెంటి విజయ్ మాదిగ, కాంబ్లే శంకర్, నండ్రు నరసింహారావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.