calender_icon.png 10 September, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

10-09-2025 01:41:23 AM

152 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం

ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 452, ఇండియా అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు 15 మంది క్రాస్ ఓటింగ్

చెల్లని ఓట్లు 15, చల్లినవి 752

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఢిల్లీ నూతన పార్లమెంట్ భవనంలోని ‘ఎఫ్ వసుధ’ వేదికగా మంగళవారం ఉత్కంఠ నడుమ ఉప రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. పార్లమెంట్‌లో అత్యధిక సంఖ్యాబలం కలిగిన ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధా కృష్ణన్ ఎన్నికలో విజయం సాధించారు. మొత్తం 781 మంది సభ్యులకు గాను, 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 మంది గైర్హాజరయ్యారు. పోలింగ్ 98.4 శాతం నమోదైంది. పోలైన ఓట్లలో 15 చెల్లనివని ఎన్ని కల అధికారులు పక్కనపెట్టారు. అనంత రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది.

ఉప రాష్ట్రపతి గెలుపునకు 377 ఓట్లు అవసరం కాగా, సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించి గెలుపొందారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి 300 ఓట్లు మాత్రమే సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజార్టీతో జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఓడించారు. తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన మూడో వ్యక్తిగా సీపీ రాధా కృష్ణన్ నిలిచారు. తమిళనాడు నుంచి గతం లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్ ఉప రాష్ట్రపతులుగా దేశానికి సేవలందించారు. దేశ 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధా కృష్ణన్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 

స్పష్టంగా కనిపించిన క్రాస్‌ఓటింగ్..

విపక్ష శిబిరానికి చెంది కొందరు ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడటం వల్లే ఇండి యా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓట్లు తక్కువగా వచ్చాయి.  ఎన్నికలకు ముందే ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కి 425 మంది ఎంపీల సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. అయితే.. వైఎస్సార్ పార్టీ 11 మంది సభ్యులు కూడా ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చారు. దీంతో ఎన్డీయే సంఖ్యాబలం 436కు చేరుకుంది. అలాగే ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శ్‌న్‌రెడ్డికి 315 మంది ఎంపీల సంఖ్యాబలం ఉంది.

కానీ, ఓట్ల లెక్కింపులో మాత్రం సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి కేవలం 300 ఓట్లు మాత్రమే లభించాయి. అంటే.. మరో 15 ఓట్లు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి తక్కువగా వచ్చినట్లు లెక్క. దీన్నిబట్టి ప్రతిపక్ష కూటమికి చెందిన కొందరు ఎంపీలు తమ కూటమి అభ్యర్థికి కాకుండా,  ఎన్టీయే అభ్యర్థికి ఓఓటు వేసినట్లు స్పష్టమవుతున్నది. ఈ ఎన్నికలో విజే త, పరాజితుల మధ్య ఓట్ల తేడా 152 ఉంది. ఇది 2022లో జరిగిన ఎన్నికతో పోలిస్తే చాలాతక్కువ. అప్పటి ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ధన్‌ఖర్ తన ప్రత్యర్థిపై 346 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 

13 మంది సభ్యులు దూరం..

13 మంది ఎంపీలు ఓటింగ్ దూరంగా ఉన్నారు. వీరిలో బీజు జనతా దళ్ (బీజేడీ)కు చెందిన ఏడుగురు, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి నలుగురు,శిరోమణి అకాళీదళ్ (ఎస్‌ఏడీ) నుంచి ఒకరు, మరో స్వతంత్ర ఎంపీ ఉన్నారు.

సామాన్య కుటుంబ నేపథ్యం..

సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఆయన 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఓ సామాన్య కుటుంబంలో జన్మిం చారు. 16 ఏళ్ల వయస్సులో ఆయన రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరి కొన్నేళ్ల పాటు కార్యకర్తగా పనిచేశారు. తర్వాత భారతీయ జన సంఘ్‌లో దశాబ్దాల పాటు పనిచేశారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కొయంబత్తూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

తర్వాత మరో పర్యాయం ఎంపీగా గెలిచారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో  పోటీ చేసినప్పటికీ గెలవలే దు. 2004 నుంచి రెండు పర్యాయాలు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేశారు. 2023లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్‌గా సేవలందించారు. జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.

అత్యుత్తమ ఉప రాష్ట్రపతి అవుతారు: ప్రధాని మోదీ

సీపీ రాధాకృష్ణన్ సుదీర్ఘకాలం నుంచి పేద ప్రజల కోసం పనిస్తున్నారు. వారి కోసం జీవితాన్ని అంకితం చేశారు. అణగారిన వర్గాల సాధికారత కోసం కృషి చేస్తున్నారు. ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ దేశానికి ఘనమైన సేవలు అందిస్తారు. అత్యుత్తమ ఉప రాష్ట్రపతిగా ప్రజల మనసుల్లో స్థిరపడతారు.

దేశపురోగతికి దోహదం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

సీపీ రాధాకృష్ణన్ గెలుపు దేశ పురోగతికి దోహదం చేస్తుంది. ఉప రాష్ట్రపతిగా ఆయన సేవలు దేశానికి అవసరం. ఆయన పదవీకాలం ఫలవంతంగా ఉండాలని, ప్రభావ శీలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా.

ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదం: కేంద్ర మంత్రి అమిత్‌షా

సీపీ రాధాకృష్ణన్ దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు పరిపాలన పరంగా అన్ని విషయాలు తెలుసు. ఆయన అనుభవం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతానికి దోహదపడుతుంది. 

పార్లమెంటరీ నైతికతను కాపాడాలి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ పార్లమెంటరీ సంప్రదాయాల నైతికతను కాపాడాలి. అధికార వర్గం ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిర్ణయాలు తీసుకోవాలి. సభలో ప్రతిపక్షాలకూ సమాన అవకాశాలు ఇవ్వాలి. ప్రతిపక్ష సభ్యులకూ సమానమైన గౌరవం ఇవ్వాలి.