05-12-2024 01:40:37 PM
విద్యార్థులు వేసే ప్రతి అడుగు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
తల్లిదండ్రుల కలలను నిజం చేసేలా ఇష్టపడి చదవండి
బాలుర కళాశాలలో తల్లిదండ్రుల సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, (విజయక్రాంతి): చదువు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని మీ తల్లిదండ్రుల కు మీరు ఎదుగుదల భరోసా కావలసిన అవసరం ఎంతైనా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎలాగో ఒకలా బతికేస్తాం అనుకుంటే పొరపాటని మీ జీవితానికే కాదు మీ కుటుంబానికి మీరు అండగా నిలవాలన్నారు. పట్టుదల స్వయంకృషితో ఇష్టపడి చదివితే మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారని తెలిపారు. ఇప్పుడు వేసే మీ ప్రతి అడుగు మీ అభివృద్ధికి తోడ్పాటు కావాలని పిలుపునిచ్చారు. గురువులు చెప్పిన ప్రతి మాటను గౌరవిస్తూ మీ అభివృద్ధికి ఆ మాటలను బాటలుగా వేసుకోవాలని సూచించారు. మిమ్మల్ని చూసి మరో పదిమంది విద్యార్థులు మీలా తయారు కావాలనే సంకల్పం వారిలో కలిగేలా విద్యార్థులు చదవాలని స్పష్టం చేశారు.
మీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు మీ అభివృద్ధి కోసం ప్రతిక్షణం ఆలోచిస్తారని ఆ విషయాన్ని మీరు గమనించి చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పాలమూరు అంటే వలసలు వలసలు కాదని, ఈ వలసలు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు పిల్లలనుంచి పిల్లలకు అస్సలు రాకూడదన్నారు. వలస పోయి పనులు చేసే బతికే పరిస్థితికి పాలమూరుకు అక్కర్లేదని మరో పదిమందికి అన్నం పెట్టే స్థాయికి మనం మంచిగా చదువుకుంటే ఈ సులభంగా సాధ్యమవుతుందని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వము విద్యకు ప్రత్యేక ప్రార్ధనతను తీసుకురావడం జరుగుతుందని మునుముందు మీ అందరికీ వివిధ కంపెనీలలో ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మీ ప్రాధాన్యతను కనబరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన పాలమూరు యూనివర్సిటీ లోనే ఇంజనీరింగ్, లా వంటి నూతన కోర్సులు కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు.
మెడికల్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంచిగా చదువుకొని మంచి ర్యాంకు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ఆకాంక్షించారు. చదువుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఇష్టాలను పరిగణలోకి తీసుకుంటూ మంచిగా చదివేల ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్ జహాన్, లెక్చరర్స్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.