17-08-2025 12:00:00 AM
మణుగూరు, ఆగస్టు 16 (విజయక్రాంతి)దట్టమైన అటవి.. చుట్టూ కొండలు, గుట్టలు.. వాటి మధ్యలో సమాధులు, సొరంగాలు.. ఎటుచూసినా నేలపై రాళ్లు పరుచుకొని ఉన్న చిత్రమైన బండలు.. వింతైన ఆకృతులు..
అపురూప దృశ్యాలు. బృహత్ శిలాయుగం నాటి రాకాసిగూళ్లు నాటి చారిత్రకు ఆనవాళ్లు.. మట్టి పొరల్లో మహాచరిత్రను నిక్షిప్తం చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక
నియోజకవర్గంలోని వేములూరు, రేగులగండి, పాండురంగాపురం గ్రామాల్లోని ఆదిమానవుల కాలంనాటి రాకాసిగూళ్లు నేటికి చెక్కుచెదరకుండా సజీవంగా కనిపిస్తున్నాయి. కాగా గుప్త నిధులు ఉంటాయన్న అనుమానంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీటిని తవ్వేస్తున్నారు. ఏండ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ రాకాసి గూళ్లను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాకాసిగూళ్లపై విజయక్రాంతి అందిస్తున్న ప్రత్యేక కథనం.
పినపాక నియోజకవర్గంలోని దట్టమైన అటవి ప్రాంతంలో ఉన్న వేములూరు, రేగులగండి, పాండురంగాపురం గ్రామాల్లో రాక్షస గూళ్లు నేటికీ చెక్కుచెదరకుండా సజీవంగా కనిపిస్తున్నాయి. గతకాలపు ఆనవాళ్లుగా, ఆనాటి వైభవానికి భావితరాలు నేర్చుకొనే చరిత్రకు పునాదులగా ఈ రాకాసిగూళ్లు నిలుస్తున్నాయి. అశ్వాపురం మండలం వేములూరు, మణుగూరు మండలంలోని రేగులగండికి సమీపంలో కొన్ని వేల ఏళ్ల కిందటివిగా భావిస్తున్న సుమారు 1,500 రాకాసిగూళ్లు ఉన్నాయి.
ఇక్కడ ఎక్కడ చూసినా వందల సంఖ్యలో రాకాసిగూళ్లు కనిపిస్తాయి. విశాలమైన మైదానంలో కొన్ని రాళ్లు పేర్చి, నల్లని బండలు పరిచి ఉంటాయి. వీటిపై చారల చారలుగా చెక్కినట్టు ఉంటుంది. ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న రాళ్లపై నిలబెట్టిన పెద్ద బండరాయి, ఒక సింహాసనం మాదిరిగా కనిపిస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్లేకొద్దీ పెద్దపెద్ద బండరాళ్లతో కప్పి ఉంచిన సమాధులు కనిపిస్తాయి.
సుమారు 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఈ సమాధులు ఉన్నాయి. చుట్టూ బండలను పేర్చి, పైన కూడా ఎంతో బందోబస్తుగా ఎవరు తెరవకుండా పెద్దపెద్ద రాళ్లు అమర్చి ఉంటాయి. ఆదిమానవులు ఈ ప్రాంతంలో సంచరించి ఉండొచ్చని ఈ ప్రాంతవాసుల నమ్మకం.
నాలుగేళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ అధికారులు సందర్శించి, ఇక్కడ ఆదిమానవుల ఆనవాళ్లు ఉన్నాయని నిర్ధారించారు. ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం తోగు అనే గుట్టపై గుహలు ఉన్నాయి.
ప్రత్యేక శైలిలో నిర్మాణాలు
తొమ్మిది అడుగుల ఎత్తుతో సమానంగా చెక్కినట్టుగా ఉండే రాళ్లతో ఈ రాకాసి గూళ్లను పేర్చారు. రాతియుగంలో మానవులు తలదాచుకొనేందుకు ఈ నిర్మాణాలు చేపట్టి ఉంటారని తెలుస్తోంది. దానిపై విశాలమైన పెద్ద బండరాయిని కప్పుగా ఏర్పాటు చేశారు.
లోనికి వెళ్లేలా చతురస్రాకారంలో మార్గాన్ని ఏర్పరిచారు. దాదాపు ఎనిమిది అడుగుల రాతి తొట్టిని రూపొందించి, మృతదేహాన్ని అందులో ఉంచి ఆ గుహకు పెద్దరాయితో మూసేసేవారు. పక్కనే వారికి ఇష్టమైన ఆహారం, అలంకరణ వస్తువులను ఆ తొట్టెలో ఉంచేవారు. కొన్ని గుహల్లో రెండు, మూడు తొట్లు కూడా ఉండేవి.
ధ్వంసమవుతున్న ఆనవాళ్లు..
ఈ పురాతన సమాధుల్లో గుప్త నిధులు ఉంటాయనే అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు వీటిని తవ్వి, వాటిపై ఉంచిన బండలను తీసేసి, పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఈ సమాధుల పైన రాళ్లను తొలగించి నిధుల కోసం అన్వేషిస్తున్నారు. అయితే పురావస్తు శాఖ అధికారులు ఈ గుహలు, సమాధులపై మరింత లోతుగా పరిశోధన చేస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.
ఈ నిర్మాణాలను ఆదివాసీ గిరిజనులు అప్పటి ఆదిమానవుల సమాధులుగా చెబుతారు. ఈ వింత నిర్మాణాలను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. గతంలో ఈ నిర్మాణాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించగా.. ప్రాచీన రాతి నిర్మాణాలను సంరక్షిస్తూ, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు.
కానీ ఆ తర్వాత అడుగు ముందుకుపడలేదు. అంతేగాక రాకాసిగూళ్ల సంరక్ష ణకు సైతం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అధికారులు, పాలకులు పెద్దగా పట్టించుకోకపోవటంతో పలువురు వీటి కింద గుప్తనిధులు ఉంటాయనే అపోహతో తవ్వకాలు చేపడుతున్నారు. యంత్రాంగం స్పందించి రాకాసి గూళ్లను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.