calender_icon.png 17 August, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాద్గార్‌పల్లిలో కొత్త రాతి చిత్రాలు

17-08-2025 12:00:00 AM

భారతదేశంలో వందలాది రాతి చిత్రాల తావులున్నాయి. వాటిలో మధ్యప్రదేశ్ లోని యునెస్కో గుర్తింపు పొందిన బింభేట్కా చిత్రిత శిలాశ్రయం ప్రసిద్ధమైంది. తెలంగాణాలో పాండవులగుట్ట దానంతటి రాతిచిత్రాలతో విశిష్టమైంది. తెలంగాణాలో నేటివరకు అన్వేషింపబడిన రాతిచిత్రాల తావులసంఖ్య 85. వీటిలో 46 రాతి చిత్రాల తావులను గుర్తించింది కొత్త తెలంగాణ చరిత్ర బృందం.

చరిత్ర బృందం రాతిచిత్రాల పరిశోధకులు అహోబిలం కరుణాకర్, ఎండి. నసీరుద్దీన్ సంయుక్తంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని యాద్గారపల్లిలో, 17.401043 ఉత్తర అక్షాంశాలు, 80.815642 తూర్పురేఖాంశాల మీద కొత్త రాతి చిత్రాల తావును గుర్తించారు. ఊరి బయట పరుపు రాతి బండ ఉన్న రాతిగుండ్లతో ఏర్పడ్డ గుహలో ఈ రాతి చిత్రాల తావు ఉన్నది. గతంలో ఈ ప్రాంతంలోనే కాశీపేట, ప్యారారం, లింగన్నపేట, ముచ్చింతల ప్రాంతాలలో కొత్త చిత్రాల తావులను ఈ చరిత్రబృందమే అన్వేషించింది.

ఎరుపు, తెలుపు రంగులలో

ఈ రాతి చిత్రాల తావులో రాతి చిత్రాలు ఎరుపు, తెలుపు రంగులలో చిత్రించబడ్డాయి. ఈ చిత్రాలలో ఒక యుద్ధరంగ దృశ్యాలు పెద్ద రాతి కాన్వాస్ మీద ఎరుపురంగులో, ఒక చిత్రం తెలుపురంగులో గీయబడ్డాయి. రాతిచిత్రాలు మంచికుంచెలతో తాజా ఎరుపు, తెలుపు రంగుల్లో వేసినట్లున్నాయి.

యుద్ధంలో పాల్గొన్న వీరులు విల్లమ్ములు, కత్తులు ధరించి పోరాడుతున్నారు. తలపడుతున్న యోధులు, నిర్జితులైన వీరులు ఈ యుద్ధ దృశ్యంలో అగుపిస్తున్నారు. ఏనుగు, పులి, గుర్రాల వంటి జంతువులు కూడా చిత్రించబడ్డాయి.

పుల్లగీతల బొమ్మలు

ఈ రాతిచిత్రాలలో ఎక్కువమట్టుకు పుల్లగీతల బొమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకచోట చేతులు పట్టుకుని, మరొకచోట ఆయుధాలు చేతపట్టి సామూహిక నృత్యం చేస్తున్న మనుష్యులు, ఎద్దువంటి జంతువు, చేతిగుర్తులు, గుర్రంవంటి జంతువును ఎక్కిన మనిషి, ఒక దగ్గర తాబేలువంటి జలచరం, ఎరుపురంగు రాతిచిత్రాల నడుమ తెలుపురంగులో గుర్రం మీద స్వారీ చేస్తున్న వీరుడు ప్రధానంగా కనిపిస్తున్నాడు.

మరికొన్ని తెలుపు రంగు బొమ్మలు ఫేడ్ అయిపోయాయి. తెలుపు రంగు బొమ్మల మీదనే ఎరుపు రంగు బొమ్మలు వేయబడడం వల్ల ఆ బొమ్మలు స్పష్టంగా అగుపించడం లేదు. తెలుపు రంగు చిత్రాలలో జంతువులు, వేటాడిన జంతువులు మోసుకుని పోతున్న నలుగరు వ్యక్తులు ఒక తావున కనిపిస్తున్నారు.

చిత్రిత శిలాశ్రయం

ఈ రాతి చిత్రాల తావులోని చిత్రాలలోని ఎరుపు, తెలుపు వర్ణాలు, చిత్రాల శైలి, వస్తుపరంగా విశ్లేషించినపుడు, ఇక్కడ సూక్ష్మరాతి(మైక్రోలిథిక్) పనిముట్ల లభ్యత కారణంగా, కొత్త రాతియుగం నూరుడుగుంటల ఆధారంగా, ఈ తావు పురామానవుల ఆవాసమని, మధ్యరాతియుగం నుంచి చారిత్రకయుగం వరకు చిత్రించబడ్డ చిత్రిత శిలాశ్రయమని పేర్కొనవచ్చు.