calender_icon.png 17 August, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపన్న రక్తం చిందిన నేల

17-08-2025 12:00:00 AM

తెలంగాణ గడ్డపై మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న. ఆయన పోరాటంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పాపన్న రక్తం చిందిన నేలగా హుస్నాబాద్ చరిత్రలో నిలిచింది. 17వ శతాబ్దం చివర్లో మొదలై, 18వ శతాబ్దం తొలినాళ్ల వరకు సాగిన పాపన్న పోరాటం ప్రజల వీరగాథగా నిలిచిపోయింది. హుస్నాబాద్ ప్రాంతంతో సర్వాయి పాపన్నకు ఉన్న ప్రత్యేక అనుబంధంపై విజయక్రాంతి ప్రత్యేక కథనం. 

హుస్నాబాద్ పట్టణాన్ని పాపన్న స్వయంగా నెలకొల్పారని, ఇక్కడ ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించి, పూజలు చేసేవారని ప్రతీతి. హుస్నాబాద్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్వాయిపేటలో పాపన్న నిర్మించిన కోట ఉంది. ఈ కోట 24 అడుగుల ఎత్తు ఉన్న ప్రధాన ముఖద్వారంతో నేటికీ పాపన్న చారిత్రక ప్రాధాన్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ కోటలో ఉన్న చాకలి బుచ్చమ్మ అర్ర, హుస్నాబాద్ సమీపంలోని ‘చాకలిదాని కొండాపూర్’, ‘చాకలిదాని పోతారం’ వంటి పేర్లు పాపన్న జీవితంతో ఈ ప్రాంతానికి ఉన్న బంధాన్ని తెలియజేస్తాయి. పాపన్న తన కార్యకలాపాలన్నీ ఈ కోట నుంచే నిర్వహించేవారని చరిత్రకారులు చెబుతారు. సర్వాయి పాపన్న చరిత్రపై భిన్నాభి్ర పాయాలు ఉన్నాయి. కొందరు ఆయన్ను పేదలకు అండగా నిలిచిన ‘రాబిన్ హుడ్‘గా కీర్తిస్తే, మొఘలుల రికార్డులు బందిపోటుగా పేర్కొన్నాయి. బ్రిటిష్ చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్‌బమ్ పాపన్నను ‘సామాజిక బందిపోటు’ వర్గానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు.

అంటే అతడు పాలకవర్గానికి నేరస్తుడు కావచ్చు కానీ, తమ సమాజంలోని ప్రజలకు మాత్రం హీరో. ఎందుకంటే, అతడు దోచుకున్న సంపదను ప్రజల సామాజిక, ఆర్థిక అవసరాల కోసం వినియోగించాడని హాబ్స్‌బమ్ పేర్కొన్నాడు. మొఘల్ ఆస్థానంలో పనిచేసిన ‘ఖాఫీ ఖాన్’ తన రచన ‘ముంతఖల్- అల్ -లుబాద్’లో పాపన్న ప్రస్తావనను మొదటిసారిగా పేర్కొన్నారు. పాపన్న దాడులు హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరిపై జరిగాయని, అతడిపై అన్ని వర్గాలవారు కలిసి ఔరంగజేబుకు ఫిర్యాదు చేశారని ఖాఫీ ఖాన్ వివరించారు.

పాపన్న అసలు పేరు నాశగోని పాపన్న గౌడ్. తల్లిదండ్రులు సర్వాయమ్మ, ధర్మన్న గౌడ్. జనగామ జిల్లాలోని షాపూర్ జన్మించిన పాపన్న, కోటను నిర్మించిన తర్వాత ఆ గ్రామం ‘ఖిలాషాపూర్’గా మారింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో, దారి దోపిడీలతో ఆయన పాలకవర్గానికి తలనొప్పిగా మారాడు. కేవలం ధనవంతులు, భూస్వాములే లక్ష్యంగా దాడులు చేసేవాడు.

పాపన్న దాడులు పెరుగుతుండడంతో ఔరంగజేబుకు ఫిర్యాదులందాయి. దీంతో మొఘల్ సైన్యం ఆయన్ను అణచివేసేందుకు ప్రయత్నించింది. 1702లో  కోటను ముట్టడించినా, పాపన్న తప్పించుకున్నాడు. తర్వాత కోటను పేల్చివేసినా, పాపన్న తిరిగొచ్చి దాన్ని మరింత పటిష్ఠంగా నిర్మించాడు. వరంగల్ కోటను దోచుకున్న అనంతరం పాపన్న, మచిలీపట్నంలో డచ్ వ్యాపారుల నుంచి తుపాకులను కొనుగోలు చేసి, తన సైన్యాన్ని మరింత బలంగా మార్చాడు. ఒక దశలో 20 కోటలు, 12 వేల మంది సైన్యంతో పాపన్న బలమైన పాలకుడిగా ఎదిగాడు. వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అతడి ప్రాబల్యం కొనసాగింది.

వరంగల్ కోటపై దాడి తర్వాత సైనిక శక్తిమంతుడై..

పాపన్న పోరాటంలో ముఖ్యమైన ఘట్టం 1708లో వరంగల్ కోటపై దాడి. పీర్ల పండగ రోజున 3 వేల మంది సైనికులు, 500 అశ్వికదళంతో దాడి చేసి, మూడు రోజుల పాటు దోపిడి కొనసాగించాడు. ఈ దాడిలో లభించిన భారీ సొమ్ముతో, పాపన్న మచిలీపట్నంలో ఉన్న డచ్ వారి నుంచి 700 డబుల్ బ్యారెల్ తుపాకులను కొనుగోలు చేశాడు. 

హుస్నాబాద్‌తో అనుబంధం

పాపన్న 1650 మధ్య కాలానికి చెందినవాడని చరిత్రకారులు చెబుతారు. జనగామ జిల్లాలోని షాపూర్ జన్మించినట్టు ప్రచారంలో ఉన్నా, రచయిత కొంపెల్లి వెంకట్ తన పుస్తకంలో ‘సర్ధార్ సర్వాయిపాపన్న’ హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం సర్వాయిపేటలో జన్మించాడని పేర్కొన్నాడు. పాపన్న కల్లుగీత వృత్తిని వదిలి, మొఘల్ సైనికులు, భూస్వాములతో జరిగిన ఘర్షణల అనంతరం పోరాట మార్గాన్ని ఎంచుకున్నాడు.

హుస్నాబాద్‌తో ఆయనకున్న అనుబంధానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. హుస్నాబాద్ పట్టణాన్ని స్వయంగా పాపన్నే నిర్మించాడని, ఇక్కడ ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించి పూజలు చేసేవాడని చరిత్రకారులు చెబుతారు. హుస్నాబాద్‌కు 10 కి.మీ. దూరంలో ఉన్న సర్వాయిపేటలో పాపన్న కోట ఉంది. కోటలో చాకలి బుచ్చమ్మ అనే యువతి పేరుతో అంతఃపురం ఉండేదని, ఆమె పాపన్న ప్రియురాలు అని చెబుతారు. 

ఇక్కడే ముగిసిన అంతిమఘట్టం..

ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో నెలకొన్న అలజడిని పాపన్న తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పాలకుడి హోదా కోసం బహదూర్‌షా దర్బార్‌లో రూ.14 లక్షల ధనం నజరానాగా సమర్పించి, సత్కారం పొందాడు. వరంగల్ కోట నుంచి కులీన మహిళలను బందీలుగా పట్టుకున్నాడన్న ఫిర్యాదులతో మొఘల్ సైన్యం అతడిపై తిరిగి దాడి చేసింది.

ఈ క్రమంలోనే తరికొండ కోటలో జరిగిన యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన పాపన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పుడు హుస్నాబాద్‌లోనే తలదాచుకున్న అతడిని మొఘల్ సైన్యం పట్టుకుంది. ఇక్కడి ఎల్లమ్మ గుడి వద్ద పాపన్నకు శిరచ్ఛేదం చేశారని చెబుతారు. కాగా శత్రువులకు దొరకడం ఇష్టంలేక తానే ప్రాణత్యాగం చేసుకున్నాడని మరో వాదన కూడా ఉంది.

భిన్న వాదనలు ఏమున్నా, పాపన్న అంతిమ ఘట్టం మాత్రం హుస్నాబాద్‌లోనే ముగిసిందని, ఈ ప్రాంతం అతడి రుధిరంతో తడిసిందన్నది చారిత్రక సత్యం. ఈ నేపథ్యంలో ఏటా ఆయన వర్ధంతి రోజు గౌడ సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఎల్లమ్మ గుడి నుంచి సర్వాయిపేట వరకు ర్యాలీ చేసి, నివాళి అర్పిస్తారు. సర్వాయిపేట సమీపంలో దాదాపు 20 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్న భూషణ గుట్టలను ‘సర్వాయి పాపన్న గుట్టలు’ అని పిలవటం అతడి పోరాటానికి నిదర్శనం.

ఈ అటవీలోనే భయ్యన్నగుట్ట ప్రాంతంలో అష్టభుజ కాలభైరవుడి విగ్రహం ఉంది. పాపన్న ఇక్కడ పూజలు చేసేవాడని ప్రతీతి. ఇక్కడి కోటలను సైతం పాపన్నే కట్టించాడని అంటారు. ఇక్కడి సర్వన్న చెరువు, మోహిని చెరువు వంటి ప్రాంతాలతో ఆయన జీవితం ముడిపడి ఉంది. ఈ ప్రాంతాన్ని, ఇక్కడి గుట్టలను క్వారీల పేరుతో కొల్లగొడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా మారుస్తామని చెబుతోంది. 

మేకల ఎల్లయ్య, హుస్నాబాద్